పట్టా ఒకరి పేరుమీద.. రైతుబంధు పైసలు మరొకరికి

by Disha News Web Desk |
పట్టా ఒకరి పేరుమీద.. రైతుబంధు పైసలు మరొకరికి
X

దిశ, కొత్తగూడ: రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అక్రమార్కుల చేతిలో అభాసుపాలవుతోంది. ఏజెన్సీ మండలాల్లో ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న దళారులు, సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కై సొమ్ము చేసుకుంటున్నారు. అటవీ భూములకు పట్టాలు ఒకరికి, రైతుబంధు డబ్బులు మరొకరికి అందుతున్న సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గంగారం మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన పులుసం ఆదినారాయణ అనే రైతుకు 6 ఎకరాల పోడు భూమికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పాస్ పుస్తకం ఉంది. ఇట్టి భూమికి 2018లో ఖరీఫ్, రబీలో పంట సాగుకు రైతుబంధు డబ్బులు రెండు విడతలుగా రూ.25 వేలు వచ్చాయి. 2019 అనంతరం రైతుబంధు పథకం అమలు నేరుగా రైతుల ఖాతాల్లోకే అందేలా నిబంధనలు విధించడంతో అట్టి రైతుల జాబితా వ్యవసాయ శాఖ అధికారుల నుండి ఐటీడీఏ అధికారులు చేతిలోకి వెళ్ళింది. నాటినుంచి పులుసం ఆదినారాయణకు రైతబంధు డబ్బులు రావడం ఆగిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతని బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోగా, అదే మండలం మడగూడ గ్రామానికి చెందిన ఈసం రాధా అనే మహిళా రైతు ఖాతాలోకి తమ రైతుబంధు డబ్బులు జమ అవుతున్నట్లు తేలింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పాస్ పుస్తకంలో యజమానుల పేరు సైతం మారింది.

అంతేగాక, కొత్తగూడ మండలం బత్తలపల్లి, కార్లాయి గ్రామానికి చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పాస్ పుస్తకం కలిగిన కుటుంబాల పెద్ద దిక్కు మృతి చెందడంతో వారికి రైతుబంధు సహాయం అందడం లేదు. యజమానుల పేరు బదులుగా వారసత్వ పేరు మార్పిడికి ఐటీడీఏ అధికారులను సంప్రదించగా, ఎకరాకు రెండువేల చొప్పున పట్టా పాస్ పుస్తకంలోని పది ఎకరాలకు రూ.20 వేలు ఇవ్వాలని ఆ శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. చేసేదేమీలేక తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే ముడుపులు ముట్టచెప్పేందుకు సిద్ధమయ్యారు. పులుసం ఆదినారాయణ అనే రైతు రైతుబంధు సహాయం సుమారు రూ.లక్షా యాభైవేలు నష్టపోయానని వాపోయాడు. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, తమకు రైతుబంధు సాయం అందేలా చొరవ చూపాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు.

అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు: సత్యనారాయణ, గంగారం తాసీల్దార్

దేశానికి వెన్నెముక అయిన రైతన్నల కళ్ళలో కారం కొట్టి మోసం చేసేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వ్యక్తినైనా వదిలిపెట్టబోమని గంగారం తాసీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. ఆరుగాలం కష్టపడి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల శ్రేయస్సు కోసం ప్రభుత్వం నుండి వస్తున్న రైతుబంధు డబ్బులు పక్కాదారి పట్టకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదివరకు రైతుబంధు విషయంలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. మండలంలోని పులుసం ఆదినారాయణకు రావాల్సిన రైతుబంధు డబ్బులు వేరొకరి అకౌంట్లో జమ అవుతున్న విషయంపై విచారణ చేపట్టి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక లోపం వల్ల కాకుండా, ఎవరైనా కాసులకు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడి, రైతులను మోసం చేస్తే, ఎంతటి వారినైనా వదిలేది లేదని, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed