Minister Harish Rao : సాగు భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దు

by Kalyani |
Minister Harish Rao : సాగు భూముల్లో ఫార్మా చిచ్చు పెట్టొద్దు
X

దిశ సంగారెడ్డి, బ్యూరో /జహీరాబాద్ : సాగు భూముల్లో ఫార్మా సిటీ ఎందుకు అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జహీరాబాద్ లోని న్యాల్కల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది, ఆ రాయి ఇవ్వాలా జహీరాబాద్ రైతుల నెత్తిన పడిందన్నారు. ఫార్మా సిటీ కోసం కేసీఆర్ హైదరాబాద్ కు దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల జాగ తయారు చేసిండు, పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయని హరీశ్ రావు గుర్తు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి.. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? అని ఘాటు విమర్శలు చేశారు. రంగారెడ్డిలో ఫార్మా సిటీ ఉన్నట్టా..? లేనట్టా అని హైకోర్టు అంటే ఉన్నది అని చెప్పారని గుర్తు చేశారు. నిజానికి మూడు నాలుగు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసి మిగతా రియల్ ఎస్టేట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని అన్నారు. న్యాల్కల్ లో భూములు సాగుకు బాగున్నాయని, పచ్చగా పంటలు పండుతూ…మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉందని అన్నారు. బంగారం వలె ఉన్న భూముల్లో ఫార్మా సిటీ ఏమిటని ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి, ఇక్కడ కంపెనీతో రైతుల ఉసురు పోసుకుంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. మూసీ ఉద్ధరణ తో ఇండ్లు కూలగొట్టుడు,పేదల ఇల్లు కూలగొట్టడం, భూములు కొల్ల గొట్టుడు ఇదేనా ఇందిరమ్మ పాలన అన్నారు.

ఇందిరమ్మ గరీబి హటావో అంటే, రేవంత్ రెడ్డి కిసాన్ హటావో, గరీబోకో హటావో అంటున్నారని నిప్పులు చెరిగారు. ఇక్కడి ప్రజలు రెండు నెలల నుంచి అన్నం తినడం లేదు, వరంగల్ డిక్లరేషన్ లో ప్రభుత్వ భూములకు పట్టాలు అన్నావు… ఇప్పుడు గుంజు కుంటున్నావు అని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే స్పందించాలని, పట్టాలు ఇచ్చుడు దేవుడు ఎరుగు ఉన్న భూములు గుంజుకోకుంటే చాలని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పు, మా పేదోల్ల భూముల జోలికి రాకుండా చూడాలని రాహుల్ గాంధీ కోరారు. ఓట్లు అయ్యాక ఢిల్లీ లో కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు, కేసీఆర్ ఇచ్చే రైతుబంధు కూడా దిక్కు లేదు, ఇంకా రుణమాఫీ కాలేదని ఇదేం ప్రభుత్వమని దుయ్యబట్టారు.

ఇక్కడి భూమిని పొనివ్వం

స్థానిక రైతులు ఒకమాట మీద ఉండాలని, ఎవడు వస్తాడో చూస్తా, ఎట్లా వస్తారో చూస్తా అని భరోసా ఇచ్చారు. కోహీర్ జామకాయలు, డపూరు పుదీనా కు ఫేమస్ అని గుర్తు చేశారు. అందరూ కలిసి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. ఫార్మా సిటీలో ఫార్మా సిటీ పెట్టాలి లేదంటే అక్కడ కూడా భూములు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పెదల భూములు గుంజుడమా..? మూసీ శుద్ధి అంటున్నావ్… మంజీరను కరాబు చేస్తావా..? ఇక్కడి నాలుగు వాగులు, పెద్ద వాగు, చెరువులు, మంజీర కలుషితం అవుతాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

మెదక్, హైద్రాబాద్ ప్రజలకు కలుషిత నీరు అందిస్తారా?

పాల లాంటి మంజీరా నీళ్ళల్లో విషపు చుక్కలు కలుపుతవా..? చీకట్లో సంతకాలు పెట్టిస్తారు, జాగ్రత్తగా ఉండండి. మోసపోకండి అని రైతులకు సూచించారు. రాళ్లు, రప్పలు ఉన్న భూములో ఫ్యాక్టరీలు పెట్టండి.. ఇక్కడ కాదు అన్నారు. ధైర్యం కోల్పోవద్దు మొత్తం బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుందన్నారు. ఎవరైనా వస్తే, ఒక్క ఫోన్ చేయండి రెండు గంటల్లో వస్తాం అన్నారు. బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను కేసీఆర్ ప్రారంభించారు. గోదావరి నీళ్లు మీకు ఇవ్వాలి అనుకున్నారు. కాంగ్రెస్ వచ్చాక పనులు ఆగిపోయాయన్నారు. ఎమ్మెల్యే లు మాణిక్ రావ్, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed