ఆడబిడ్డ సొమ్ముకు కక్కుర్తి..!

by Sumithra |
ఆడబిడ్డ సొమ్ముకు కక్కుర్తి..!
X

దిశ, డోర్నకల్ : పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థిక సాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి చెందిన బాల మోహన్ సింగ్ తన కుమార్తె వివాహం గత ఏడాది (2022) ఏప్రిల్ మాసంలో పెళ్లి చేశాడు. పెళైన వెంటనే కళ్యాణ లక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. దరఖాస్తు ప్రింటవుట్‌తో పాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్‌ను మండల కార్యాలయంలో సమర్పించాడు. కొద్ది రోజుల తర్వాత రెవెన్యూ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ డానియల్ తమ కల్యాణ లక్ష్మి ఫైల్ విచారణకు రూ.25,000 లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. ఆడపిల్ల తండ్రిని అంత ఇచుకోలేనని ప్రాధేయపడగా కొంతమంది దళారుల పేర్లు సూచించాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా వీఆర్ఏ డానియల్ ఫైల్ అప్రూవల్ కాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించాడు. మొదట్లో జత చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం గడువు ముగియడంతో మరలా కొత్తగా ఆదాయ దృవీకరణ పత్రం చేయించడానికి రూ.2,000 లంచం తీసుకున్నాడని ఆరోపించారు. పెళ్లి సమయంలో అందవలసిన కల్యాణ లక్ష్మి సహాయం మనవరాలు జన్మించినా తన కూతురికి అందలేదని వాపోయాడు. తాను ఆర్మీలో పని చేశానన్నా సాకు చూపుతున్నారని అన్నారు. పలుమార్లు క్షేత్రస్థాయిలో ఆర్ఐ విచారణ చేశారని తెలిపారు.

రెవెన్యూ ఆఫీసు వీఆర్ఏ డానియల్ కను సన్నల్లో నడుస్తుందని ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మార్వో, వీఆర్ఏ డానియల్ పరిశీలించిన తర్వాత సంతకం పెడతానని అంటున్నారు. కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతున్నా కళ్యాణ లక్ష్మి ఫైల్ కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తగు విచారణ జరిపి తన కూతురికి న్యాయం చేయాలని ఆ తండ్రి వేడుకుంటున్నాడు.

ఎమ్మార్వో స్వాతి బిందును వివరణ కోరగా.. కార్యాలయంలో పెండింగ్ ఫైలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తురాలు తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ నౌకరిచేసినట్లు తెలిసిందన్నారు. అందుకు పూర్తి విచారణ జరపమని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.

కార్యాలయంలో వన్ మ్యాన్ షో..

డోర్నకల్ తహశీల్దార్ కార్యాలయంలో ఆ వీఆర్ఏ వన్ మ్యాన్ షో నడిపిస్తున్నట్టు సమాచారం. ఆఫీస్ సిబ్బందికి షాడో అధికారిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఈ కార్యాలయంలో అన్ని తానై దీపం ఉన్నప్పుడు.. ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందంగా ఆ వీఆర్ఏ అందినకాడికి దండుకుంటున్నారని రెవెన్యూ వర్గాలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాలు మొదలు కళ్యాణ లక్ష్మి పథకం వరకు కప్పం కట్టనిదే పనులు చేయని పరిస్థితి నెలకొంది. అంతేకాదండోయ్... సదరు వీఆర్ఏ ధ్రువీకరణ పత్రాలు, కళ్యాణ్ లక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలన కోసం సామాజిక వర్గాల ప్రకారం నగదు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇంటి పర్మిషన్లు, ధ్రువీకరణ పత్రాలు, పేరు మార్పుడీలు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల దరఖాస్తుల పరిశీలన ఇలా ఏ పనైనా పైసా వసూలే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో ఉన్నతాధికారి చూసి చూడనట్లు ఆ వీఆర్ఏని వదిలేయడంతో ఆయన ఆగడాలు మరింత శృతిమించుతున్నాయని తహశీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story