ఏజెంట్లదే హవా.. వ‌రంగ‌ల్ ఆర్టీఏ ఆఫీసులో అవినీతి ప‌ర్వం

by Anjali |
ఏజెంట్లదే హవా.. వ‌రంగ‌ల్ ఆర్టీఏ ఆఫీసులో అవినీతి ప‌ర్వం
X

దిశ‌, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్‌ ఆర్టీవో కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. అక్కడ ఏ పని జరగాలన్నా ఏజెంట్ల మార్గం నుంచి వెళ్లాల్సిందే. లంచం తీసుకుంటున్నామనే అపవాదు రాకుండా, బ్రోకర్‌ ఇచ్చే డబ్బులైతే ఏ సమస్యా ఉండదని భావిస్తున్నారు. ఈ తతంగం ఆర్టీవో కార్యాలయంలో నిరంతరం కొనుసాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. రవాణా శాఖ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఎవరేం చేస్తారనే ధైర్యంతో బ్రోకర్లు, అధికారులు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్సు కోసం వెళ్లినా, రెన్యూవల్‌ చేయించాలన్నా, వాహనం ఫిట్‌నెస్‌ కోసం వెళ్లినా నేరుగా ఏ పని కాదు. అలా చేయాలంటే దానికి సవాలక్ష కారణాలను చూపి అధికారులు ఫైల్‌ను మూలకేస్తారు. కార్యాలయం చుట్టూ తిరిగి వేసాగే వాహ‌న‌దారులు గత్యంతరం లేక బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు.

సామాన్యులు నేరుగా వెళ్తే రాని అడ్డంకులు బ్రోకర్లు వెళ్లగానే వెంట‌నే ప‌ని పూర్తవుతోంది. కార్యాల‌యంలో అధికారుల‌కు క‌న్నా బ్రోక‌ర్ల హ‌వానే ఎక్కువ‌గా కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఆ మ‌ధ్య మ‌హ‌బూబాబాద్ ఆర్టీవో కార్యాల‌యంలో ఏసీబీ దాడులు జ‌రగ‌డంతో కొద్దిరోజులు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నట్లుగా క‌నిపించినా, ఏజెంట్ల ద్వారా మాత్రం జ‌ర‌గాల్సిన ప‌నులు జ‌రిగిపోతున్నాయి. కార్యాల‌యం చుట్టుప‌క్కల‌కు, కార్యాల‌యంలో ఏజెంట్ల రాక‌పోక‌లు త‌గ్గినా అధికారుల‌కు నేరుగా ఫైళ్లను అంద‌జేస్తూ ప‌ని పూర్తి చేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. రూ.వెయ్యి చలానాకు రూ.3వేల వరకు వసూలు చేస్తూ అందులో కొంత కార్యాలయంలోని కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న సిబ్బందికి అందజేస్తున్నారు.

ఆర్టీఏ కార్యాల‌యం చుట్టూ ఏజెంట్ల వ‌ల‌యం..

కార్యాలయ పరిసరాల్లోనే దర్శనమిచ్చే వీరంతా ఎవరికీ అనుమానం రాకుండా జిరాక్స్ షాపులు, మొబైల్ దుకాణాలు, రీచార్జ్, టిఫిన్ సెంటర్స్, బుక్ సెంటర్స్ , రేడియం, కలర్ జిరాక్స్ షాపుల పేరిట ఈ తరహా దందాలు కొనసాగిస్తున్నారు. వీరు చెప్పందే ఆఫీస్‌లో ఏ ఫైల్ కదలదు. పనికో రేట్ ఫిక్స్​చేసిన ఏజెం ట్లు తాము తీసుకున్న డబ్బుల్లోంచి అధికారులకు కొంత ముట్ట జెప్పి వాహనదారులకు పనులు చేసి పెడుతున్నారు. అందుకే వాహనదారుడు రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ కోసం రూల్స్ ప్రకారం అన్ని ప్రూఫ్స్‌ తో వచ్చినా పనులు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణాశాఖకు, వాహనదారులకు మధ్య నగదు లావాదేవీలు గత కొన్నేళ్లుగా తగ్గిపోయాయి. ఏ పని కావాలన్నా ఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అర్జీదారులు, నగదు రహిత లావాదేవీలతో ఆఫీసులో పనులు జరుపుతున్నా కొన్ని ఫైళ్లు మాత్రం అవినీతి జలగలకు ఆదాయమార్గాలవుతున్నాయి.

అంతా ఏజెంట్ల చేతిలోనే...

వరంగల్ జిల్లా ఆర్టీఏ కార్యా లయం నుంచి వాహ‌న‌, డ్రైవింగ్ లైసెన్సులు పొందేవారు రోజు సుమారు 400నుంచి 800మంది వరకు ఉంటారు. ఇందులో నేరుగా పొందే వారు వందల సంఖ్యలోనే ఉంటారు. ఒక్కో బ్రోకర్ లేదా ఏజెంట్ త‌న తరఫున 20నుంచి 30వరకు లైసెన్స్ పత్రాలను ఆఫీస్‌లోకి తీసుకెళ్తారు. వారికి ప్రత్యే కంగా కోడ్ ఏర్పా టు చేసుకుని అధికారులతో పనులు చక్క బెట్టుకుంటారు. ఏజెంట్లను దరఖాస్తుదారులు సంప్రదిస్తే వారు అన్నింటినీ పూర్తి చేసి ఫైళ్లపై తమ కోడ్ ను ఆఫీసుకు పంపిస్తున్నారు. ఫైళ్లపై కోడ్ లు ఉంటే ఆర్టీవో ఆఫీసులోని కౌంటర్ల వద్ద అర్జీదారుడు ఫొటో దిగడం, డిజిటల్ సంతకం చేయడం చకాచకా సాగిపోతున్నాయి. అర్జీదారుడు నేరుగా వస్తే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం, ఏ చిన్న పొరపాటున్నా అలాంటి తప్పును ఎత్తిచూపి ఫైల్ ఆపేయడం చేస్తుంటారు. ఈ మాదిరిగా వాహనదారుల నుంచి రోజుకు లక్షలాది రూపాయలు దండుకుంటూ దళారులు, అధికారులు ‘తలా పాపం తిలా పిడికెడు’ అన్నట్టుగా గుట్టు చప్పు డు కాకుండా పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఇప్పటికైనా ఆర్టీఏ ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి కార్యాలయంలో దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed