ఆ తీర్మానంలో ఆంతర్యమేంటి?

by Mahesh |
ఆ తీర్మానంలో ఆంతర్యమేంటి?
X

నర్సంపేట మున్సిపాలిటీ ఖజానాకు కౌన్సిలర్లే తూట్లు పొడుస్తున్నారు. టెండర్ల బకాయి వసూలుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏకంగా రద్దు కోసం తీర్మానం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి యేడు వివిధ పనులకు టెండర్లు నిర్వహిస్తారు. టెండర్​దక్కించుకున్న గుత్తేదారు 25 శాతం సొమ్ము చెల్లింది మిగతాది వాయిదాల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. 2021-22 సంవత్సరానికి స్థానిక అంగడిలో తై బజార్, గొర్రెల, మేకల రాదారిని టెండర్​దక్కించుకున్న గుత్తేదారులు రూ.15.60లక్షలు బకాయి పడ్డారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.8 లక్షలు చెల్లించలేదు.

మొత్తంగా నర్సంపేట మున్సిపాలిటీ ఖజానాకు రూ.23.60లక్షలు రావాల్సి ఉంది. గడువు తీరినా గుత్తేదారులు డబ్బులు చెల్లించకపోవడం, మరో వైపు బకాయిల రద్దు కోసం కౌన్సిలర్లు తీర్మానం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బకాయి రద్దు చేస్తే ఒక్కో కౌన్సిర్​కు రూ.50వేలు చెల్లించేందుకు గుత్తేదారులు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ మేరకే కౌన్సిలర్లు బకాయిల రద్దకు తీర్మానం చేసి నివేదిక పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికవరీ చట్టం కింద బకాయిలను వసూలు చేసే అవకాశం అధికారులకు ఉన్నా నేటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

దిశ, నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు మున్సిపల్ ఖజానాకు రావాల్సిన బకాయిల రద్దు కోసం తీర్మానం చేయడం చర్చకు దారితీసింది. మున్సిపల్ ఖజానాను కాపాడాల్సిన కౌన్సిలర్లే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి గుత్తేదారు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన బకాయిలకు మోకాలడ్డటమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఏడూ మున్సిపల్ కార్యాలయంలో వివిధ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది.

టెండర్ దక్కించుకున్న గుత్తేదారు 25 శాతం చెల్లించి మిగతాది వాయిదాల ప్రకారం చెల్లించాలి. ఈ క్రమంలో గడువు తీరిన బకాయి చెల్లించకపోవడం ఒక వంతు అయితే సదరు చెల్లింపులను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపండంలో ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నెలకొంది.

అసలేం జరిగింది..?

నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయంలో 2021-22 సంవత్సరానికి గానూ స్థానిక అంగడిలో తై బజార్​ను రూ.15.60లక్షలకు ప్రభాకర్ అనే వ్యక్తి పొందగా, గొర్రెల, మేకల రా దారిని రూ.21 లక్షలు నూతన్ కుమార్ పొందారు. అదే రోజు టెండర్ లో 25 శాతం నగదు చెల్లించారు. మిగతా వాయిదాల్లో చెల్లించాల్సిందిగా అధికారులు తెలిపారు. కాగా సదరు గుత్తేదారులు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయలేదు. గొర్రెల, మేకల రాదారి పొందిన సదరు గుత్తేదారు నేటికి రూ.8 లక్షలు చెల్లించగా, రూ.13 లక్షలు బకాయి ఉన్నారు.

తై బజార్‌ను పొందిన గుత్తేదారు రూ.2.60లక్షలు బాకీ ఉన్నారు. మొత్తంగా 2021-22 సంవత్సరానికి గాను రూ.15.60లక్షలు సదరు గుత్తేదారులు 2022 మార్చి వరకు చెల్లించాల్సి ఉంది. అనంతరం 2022-23 అంగడి తై బజార్​, గొర్రెల, మేకల రాదారికి సంబంధించి రూ.8 లక్షలు టెండర్ దక్కించుకున్న గుత్తేదారు చెల్లించలేదని సమాచారం. నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయ ఖజానాకు మొత్తంగా రూ.23.60లక్షలు రావాల్సి ఉంది. ఈ ఏడాది (2023-24 )అంగడికి సంబంధించి టెండర్ ప్రక్రియ సైతం మొదలయ్యే సమయం అసన్నమవడం గమనార్హం.

ఆర్ఆర్ యాక్ట్ అమలు చేశారా..?

అంగడి వేలం పొందిన గుత్తేదారులు నిర్ణీత గడువు ముగిసే లోపు వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మున్సిపాలిటీ అధికారులు సదరు గుత్తేదారులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం, బకాయి సొత్తును పూర్తిగా వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆర్ఆర్ యాక్ట్‌తో బకాయిలను వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నా నేటికీ కార్యరూపం దాల్చడం లేదు. మున్సిపాలిటీకి రూ.వెయ్యి బకాయి పడితే పెట్టాల్సిందేనని హుకుం జారీ చేసే అధికారులు ఖజానాకు రూ.లక్షల్లో గండిపడుతున్నా ఎందుకు వసూలు చేయడంలేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కౌన్సిల్‌లో రద్దు తీర్మానం..

నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాల్సిన కౌన్సిలర్లు మున్సిపల్ ఖజానాకు రావాల్సిన బకాయిలను రద్దు చేయాలని ఫిబ్రవరిలో తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించారు. కాగా కలెక్టర్ ఆ తీర్మానాన్ని ఆమోదించలేదని విశ్వసనీయ సమాచారం. అసలు బకాయిల రద్దు కోసం కౌన్సిలర్లు తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని పట్టణంలో చర్చ జరుగుతోంది.

పట్టణంలో ఊహాగానాలు..

నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్లు చేసిన బకాయి రద్దు తీర్మాణంపై భిన్న ప్రచారాలు జరుగుతున్నాయి. బకాయిలు మాఫీ చేస్తే కొంత నగదు ముట్టజెబుతామని గుత్తేదారులు ఇచ్చిన హామీ మేరకు కౌన్సిలర్లు బకాయి రద్దుకు పూనుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రతి కౌన్సిలర్ కు రూ.50వేలు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు, దీనికి సంబంధించి ఓ గుత్తేదారు ఇప్పటికే అడ్వాన్స్ గా రూ.4లక్షలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

బకాయిలను సకాలంలో వసూలు చేయడంలో సహకరించాల్సిన కౌన్సిలర్లు రద్దు కోసం తీర్మానం చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. రెవెన్యూ రికవరీ చట్టం కింద బకాయిలను వసూలు చేసే అవకాశం అధికారులకు ఉన్నా నేటికీ వసూళ్లకు పూనుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏదేమైనా నర్సంపేట మున్సిపాలిటీ ఖజానాకు చేరాల్సిన బకాయి డబ్బులు ఇప్పటికైనా చేరేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story