జనావాసాల మధ్య కోళ్ల ఫాంలు.. ఫిర్యాదు చేస్తే ప్రాణం తీస్తామంటూ బెదిరింపులు..

by Kalyani |   ( Updated:2023-04-01 11:33:40.0  )
జనావాసాల మధ్య కోళ్ల ఫాంలు.. ఫిర్యాదు చేస్తే ప్రాణం తీస్తామంటూ బెదిరింపులు..
X

దిశ, డోర్నకల్: జనావాసాలకు సమీపంలో కోళ్ల ఫాంలు నిర్మించడం కారణంగా గ్రామాలలో వాతావరణం కాలుష్యంగా మారుతుంది. ముక్కు పుటాలు అదిరేలా వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఈ బాధలు పడలేమంటూ ఉన్న ఊరిని వదిలి వెళ్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాల్లోకి వెళ్లితే.. డోర్నకల్ మండలం మల్లయ్య కుంట తండా గ్రామంలో జనావాసాలకు సమీపంగా పెద్ద కోళ్ల ఫాంలు నిర్మించారు. దీంతో తీవ్ర దుర్గంధం వెలువడుతోంది.

స్థానికులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రామానికి చెందిన తేజవత్ సురేష్ ట్విట్టర్ వేదికగా కలెక్టర్ కు, మంత్రికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామపంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. కాగా ఫిర్యాదారుడిని ప్రాణాలు తీస్తామంటూ కోళ్ల పాం యాజమానులు బెదిరింపులను పాల్పడుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 100 కోళ్ల ఫాంలు ఉంటాయి.

కోళ్ల ఫాంల యాజమానులు దాడి చేసిండ్రు: ఫిర్యాదారుడు (బాధితుడు) తేజావత్ సురేష్

మా ఇంటికి అతి సమీపంలో కోళ్ల ఫాంలు నిర్మించారు. కోళ్ల వ్యర్థాల ద్వారా నిత్యం రోగాల బారిన పడుతున్నాం. అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. గ్రామం చుట్టూ పదుల సంఖ్యలో కోళ్ల పాంలు నెలకొల్పారు. ప్రజా ఆరోగ్యాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ కి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాను. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. కాగా అర్ధరాత్రి సమయంలో కోళ్ల ఫాంల యాజమానులు రవీందర్, నరేందర్ లు మా ఇంటికి కరెంటు కనెక్షన్ ను తొలగించి నాతో పాటు నా కుటుంబ సభ్యులపై దాడి చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా.. ప్రాణాలు తీస్తామంటూ దుర్భాషలాడారు. ప్రాణ భయంతో కుటుంబసభ్యులతో సహా పారిపోతుండగా ద్విచక్ర వాహనాలతో వెంబడించారు. దీనిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశా.

నోటీసులు జారీ చేశాం: ఎంపీఓ మున్వర్ బేగ్

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలోని కోళ్ల ఫాంలకు నోటీసులు జారీ చేశాం. కోళ్ల పెంపకాన్ని నిలిపేయాలని ఆదేశించడం జరిగింది. మండలంలోని కోళ్ల పాంలకు ఆయా గ్రామ పంచాయతీల తీర్మానం, సంబంధిత అనుమతులు లేవు. జనావాసాలకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉండాలి. ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed