వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం..

by Kalyani |
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం..
X

దిశ, వరంగల్‌ టౌన్‌: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ బలగం దండులా కదిలింది. ఎమ్మెల్యే నరేందర్‌ మోగించిన ఎన్నికల శంఖారావానికి నినాదమై మారుమోగింది. మంగళవారం ఓ సిటీ మైదానంలో జరిగిన ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున కదలివచ్చారు. 6 వేల పైచిలుకు నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌ అభిమానులు తరలివచ్చారు. ఉదయమే తమ తమ డివిజన్లలో గులాబీ జెండాలను డివిజన్‌ అధ్యక్షులు, కార్పొరేటర్లు కలిసి ఆవిష్కరించి, అనంతరం ర్యాలీగా ప్లీనరీ సమావేశానికి తరలివచ్చారు. నరేందర్‌కు అండగా నిలుస్తామని ప్రమాణం చేశారు. పలు సంఘాల నాయకులు ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయానికి తమవంతు కృషి చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే నరేందర్‌ అధ్యక్షతన ప్రారంభమైన ప్లీనరీ.. సాయంత్రం ఆరింటివరకు కొనసాగింది. సమావేశం ప్రారంభానికి ముందు వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌, అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు ఎమ్మెల్యే నరేందర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సభను ఆరంభించారు. సభకు హాజరైన ప్రతీ నాయకుడికి, కార్యకర్తకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో తాను చేపట్టిన పనులను వివరించారు. తనకంటే ముందు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి హయాంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసి వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో తన విజయానికి కృషి చేయాలని, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్నారు. కాగా, ఈ ప్లీనరీకి సీనియర్‌ నేతలు పలువురు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. వారిని చూసి ఎంతకాలమైందంటూ పలువురు చర్చించుకున్నారు. ఇక ఎమ్మెల్యే నరేందర్‌ వారితో భోజన విరామానికి వెళ్లేముందు ప్రత్యేకంగా ఫొటో దిగారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు, ముఖ్య నేతలతో వేదికపై మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. అందరూ బీఆర్‌ఎస్‌ పాలనా తీరును వివరించారు. వరంగల్‌ నగరం మరింత అభివృద్ధి సాధించాలంటే నరేందర్‌ను గెలిపించుకోవాలని, అలాగే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ విజయానికి సహకరించాల్సిన అవసరం ఉందని సభకు వివరించారు. తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు. భోజన విరామం అనంతరం కార్పొరేటర్లు ప్రసంగించగా, పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.

పలు సంఘాల సంఫీుభావం..

కాగా, ఎమ్మెల్యే నరేందర్‌కు మద్దతుగా పలు సంఘాలు కదిలివచ్చాయి. ఆటో యూనియన్‌, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, కూరగాయల మార్కెట్‌ వ్యాపారులు, మెడికల్‌ అసోసియేషన్‌, ఆర్ఎంపీ అసోసియేషన్, బంగారు నగల వ్యాపారుల వర్తక సంఘం, ఐరన్ హార్డ్వేర్ సంఘం, వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ ఇంకా వివిధ సంఘాల నాయకులు నరేందర్‌ వెన్నంటి ఉండి ఆయన విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నరేందర్‌ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్‌ జిందాబాద్‌, అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని మేయర్‌ పిలుపు..

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని, అందుకు ప్రతీ కార్యకార్త ఓ సైనికుడిలా పని చేయాలని గ్రేటర్ వరంగల్‌ బల్దియా మేయర్‌ గుండు సుధారాణి గులాబీ బలగానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నరేందర్‌ ఆహ్వానం మేరకు ప్లీనరీకి హాజరైన ఆమె తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనా తీరును వివరించారు. కేసీఆర్‌ పాలనను యావత్‌ భారతదేశం కోరుకుంటున్నదని, మరోసారి మన రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ శ్రేణులదేనని అన్నారు. అందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఆకట్టుకున్న కేసీఆర్‌ వీడియో..

ఉదయం సెషన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై చిత్రీకరించిన ఓ వీడియోను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమం, తదనంతర పరిణామాలు, పలు పథకాల అమలు విధానాలపై తీసిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్లీనరీ మధ్యలో కళాకారుల ఆటాపాటా సభికులను అలరించాయి. భద్రకాళీ అర్చకుల ఆశ్వీరచనం ఉదయం పదకొండు నలభై నిమిషాల సమయంలో భద్రకాళీ అర్చకులు ప్లీనరీ సమావేశం వద్దకు వచ్చారు. వారిని ఎమ్మెల్యే నరేందర్‌ వేదికపైకి ఆహ్వానించి, గులాబీ బాస్‌ కేసీఆర్‌కు ఆశీర్వచనాలు అందించాలని కోరారు. ఈ మేరకు అర్చకులు కొన్ని మంత్రాలు చదివి, విజయోస్తు అంటూ వెళ్లిపోయారు.

పోలీసుల బందోబస్త్‌..

కాగా, ఈ ప్లీనరీకి పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ నిఘా నిర్వహించారు. వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌ పర్యవేక్షణలో సివిల్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్లీనరీ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. 32 వంటకాలతో భోజనం మధ్యాహ్న భోజనంలో 32 వంటకాలను వడ్డించారు. ప్లీనరీకి హాజరైన వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. మొదటి బంతికి ఎమ్మెల్యే నరేందర్‌ దగ్గరుండి భోజనం వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే కూడా వారితో కలిసి భోజనం చేశారు.

Advertisement

Next Story

Most Viewed