ఆరు గ్యారంటీల‌తో కాంగ్రెస్ ద‌గా.. బోగ‌స్ హామీల‌తో అర‌చేతిలో వైకుంఠం చూపింది : కేసీఆర్‌

by Aamani |
ఆరు గ్యారంటీల‌తో కాంగ్రెస్ ద‌గా.. బోగ‌స్ హామీల‌తో అర‌చేతిలో వైకుంఠం చూపింది :  కేసీఆర్‌
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆరు గ్యారంటీల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అర‌చేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా ద‌గా చేస్తోందంటూ బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విమ‌ర్శించారు. బోగ‌స్ హామీల‌తో అధికారం ద‌క్కించుకున్న‌కాంగ్రెస్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌కుండా త‌ప్పించుకుంటోంద‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఏ ఒక్క‌టిని స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేద‌ని అన్నారు. రైతుబంధు, రైతురుణమాఫీ, రైతు బీమా, మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2500 ఇలా ఏ ఒక్క ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌డం లేద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అర‌చేతిలో వైకుంఠం చూపి... రాష్ట్రంలో అనేక మంది రైతుల ఉసురుపోసుకుంటోంది క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండి నియోజ‌క‌వర్గంలో ఓరైతు త‌న వండ్ల‌ను కొనుగోలు చేయాల‌ని బాధ‌తో ధాన్యాన్ని ఆర‌బెడుతూ అక్క‌డే కుప్ప‌కూలిపోయాడ‌ని అన్నారు. రైతుల‌కు కేసీఆర్ కేవ‌లం రూ.10వేలు ఇస్తున్నారు.. మేం 15వేలు ఇస్తామ‌ని కాంగ్రెస్ ఎన్నిక‌ల ముందు చెప్పింది.. ఇప్పుడు రూ.15వేలు ఇవ్వ‌లేదు.. ఆ పాత ప‌దివేలు కూడ ఇయ్య‌లేదు. రైతుబంధు, బోన‌స్ ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ద‌గా చేసింద‌ని, ఈఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్ప‌కుంటే వాగ్ద‌నాలు కూడా నెర‌వేర్చ‌కుండా వ‌దిలేస్తుంద‌ని అన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌స్సుయాత్ర‌ బుధ‌వారం రాత్రి మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసంద‌ర్భంగా మానుకోట నెహ్రూసెంట‌ర్‌లో నిర్వ‌హించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడారు.


జిల్లా ఉండాల్నా... వ‌ద్దా అన్న‌ది ప్ర‌జ‌లు తేల్చుకోవాలే..!

మ‌హ‌బూబాబాద్ జిల్లాను ర‌ద్దు చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వ‌యంగా జిల్లా ర‌ద్దుపైమాట్లాడుతున్నార‌ని అన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా ఉండాలో.. ర‌ద్దు కావాలో ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల‌ని అన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా ఉండాలంటే ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మెడ‌లు వంచాలంటే ఇక్క‌డ మాలోతు క‌విత‌ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో మ‌హ‌బూబాబాద్ ప్రాంతానికి సాగునీరు రాలేద‌ని, తెలంగాణ ఏర్ప‌డ్డాక త‌న చొర‌వ‌తో వెన్నారం కాల్వ నిర్మాణం జ‌రిగాకే.. ఈ ప్రాంతానికి ఎస్సారెస్పీ నీళ్లు వ‌చ్చాయని అన్నారు. 70ఏళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో గిరిజ‌నుల‌కు కాంగ్రెస్ ఏం చేయ‌లేదు. తండాల‌ను పంచాయ‌తీలుగా మార్చిన ఘ‌న‌త బీఆర్ ఎస్ పార్టీకి ద‌క్కింది. కాంగ్రెస్ పార్టీ, ప్ర‌భుత్వం మోసాల‌ను గిరిజ‌న యువ‌త, గిరిజ‌న మేధావులు గుర్తించాలి. ఇప్పుడు గిరిజ‌నులు ఆలోచ‌న‌తో ప‌నిచేయాల్సి స‌మ‌యం ఇది. విచ‌క్ష‌ణ‌తో ఆలోచించి బీఆర్ ఎస్ పాల‌న‌లో ఉన్న‌పుడు ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం ఎలా ఉండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా ఎలా ఉంద‌న్న విష‌యంపై చ‌ర్చించుకోవాల‌ని అన్నారు. న‌రేంద్ర‌మోదీ గోదావ‌రిని ఎత్తుక‌పోతాన‌ని అంటున్న ముఖ్య‌మంత్రి నోరు మెద‌ప‌డం లేదు..ఇప్ప‌టికే కేఆర్ ఎంబీని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అప్ప‌గించార‌ని విమ‌ర్శించారు.


తెలంగాణ‌ను కాపాడుకుంటా..!

బీఆర్ ఎస్ ప్ర‌చారానికి, ఈ రోడ్ షోను విజ‌యవంతం చేసేందుకు వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన జ‌నాల‌కు ధ‌న్య‌వాదాలు, మ‌హ‌బూబాబాద్‌లో జ‌న ఉప్పెన క‌నిపిస్తోంది. నేల ఈనిందా అనే విధంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, ఈ ప్రాంతాన్ని ఆగం కానివ్వ‌ద్ద‌నే ల‌క్ష్యంతోనే ఈ వ‌య‌స్సులోనూ తాను పోరాటంతో ముందుకు సాగుతున్నాన‌ని కేసీఆర్‌ అన్నారు. ఈ పోరాటానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని, ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుతోనే తన పోరాటం ముందుకు సాగుతుంద‌ని అన్నారు. నా ప్రాణం ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ‌కు అన్యాయం చేయ‌నివ్వ‌న‌ని అన్నారు. బీఆర్ ఎస్ పార్టీకి స్వ‌ప్ర‌యోజ‌నాలేం ఉండ‌వు.. ప్ర‌తీమాట, ప్ర‌తీ అడుగు ప్ర‌జ‌ల‌కోస‌మే కొట్లాట అన్న‌ట్లుగా ఉంటుంద‌ని అన్నారు. బీఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ఇంటి పార్టీగా ప‌నిచేస్తుంద‌న్నారు. బీఆర్ ఎస్ పార్టీని ఎన్నిక‌ల్లో ఆద‌రించాల్సిన బాధ్య‌త ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై ఉంద‌ని, మానుకోట ఎంపీగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసిన మాలోతు క‌విత‌ను ప్ర‌జ‌లు మ‌రోసారి ఆశీర్వ‌దించాల‌ని కోరారు. ఈసీ నేను ప్ర‌చారం చేయ‌కుండా 48గంట‌లు నిషేధం విధించింది, అదే రేవంత్ రెడ్డి నా క‌నుగుండ్లు పీకుతానంటూ మాట్లాడినా చ‌ర్య‌లు తీసుకోలేదు.. నిషేధాలు విధించ‌లేదు... ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లంతా గ‌మ‌నించాల‌ని అన్నారు. కేసీఆర్‌ను ఆప‌గ‌లిగినా... బీఆర్ ఎస్‌లోని నేత‌లంతా, కార్య‌క‌ర్త‌లంతా నిర్విరామంగా పార్టీ ప్ర‌చారం కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకుంటార‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. గులాబీ జెండా ఎత్తి కొట్లాడుతార‌ని అన్నారు.

Advertisement

Next Story