మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్టులు..

by Sumithra |   ( Updated:2023-06-17 13:36:50.0  )
మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా ముందస్తు అరెస్టులు..
X

దిశ, ఖిలా వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్భన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తమని హౌస్ అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తనను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. పోలీసుశాఖ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి తొత్తుగా మారిందని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నారని, బీజేపీ నాయకులు, కార్యకర్తల పై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం అన్నారు. బీఆర్ఎస్ నాయకుల రౌడీ రాజ్యం నడుస్తోందని, వారి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. వారి అన్యాయాలను ప్రశ్నించిన వారిని భయపెడుతున్నారని మండిపడ్డారు.

ప్రజాసమస్యల పై పోరాడుతున్న బీజేపీ ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయింది. రాత్రి నిద్రించే సమయంలో బీజేపీ నాయకుల ఇండ్లలోకి ప్రవేశించి వారిపై దౌర్జన్యాలకు దిగడంతో ఇంట్లో ఉన్న ఆడవారు బయబ్రాంతులకు లోనవుతున్నారన్నారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతిని రాజకీయాలకు అంటిస్తే.. బీఆర్ఎస్ అందులోనే మాడి మసై పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి బీజేపీ కార్యకర్తలు ఎవరికీ బయపడాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ కార్యకర్తలకు తాను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాల్సిందిగా కోరారు.

స్థానిక ఎమ్మెల్యే ఆర్భాటాలకు పోతూ ప్రజల సొమ్మును తన అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. వారి పార్టీ వేడుకలని, వారి అధినాయకుల పుట్టిన రోజులని, యువరాజు నగరానికి వచ్చిన ప్రతీసారి కొన్ని కోట్ల ప్రజల సొమ్మును ఖర్చు చేస్తూ హంగూ ఆర్బాటాలకు పోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కామన్ గ వచ్చే పెన్షన్లు తప్పితే నగరప్రజల కోసం స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ది ఏమీ లేదన్నారు. ఏ ఒక్క చిన్న పరిశ్రమను కూడా నగరానికి తీసుకరాలేదన్నారు. మహిళల కోసం ఏవైనా ఉపాధి కల్పన పరిశ్రమలు తీసుకురాలేకపోయారన్నారు. టెక్స్ టైల్ పార్క్ పై శ్రద్ద పెట్టకపోవడంతో పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు.

రాష్ట్రాభివృద్ది అంటే కేవలం సిద్దిపేట, గజ్వేల్ ను మోడల్ గా చూపిస్తున్నారని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ నగరానికి ఏటా 300 కోట్లు కేటాయిస్తానని చెప్పి మాటతప్పారన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంత వరకు ఎవరికీ ఇవ్వలేదన్నారు. తూర్పు నియోజకవర్గంలోని భూములను కుదవపెట్టి హన్మకొండ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుంటున్నారని, అది చూస్తూ కూడా సైలెంట్ గా ఉంటున్న ఇటువంటి చాతగాని ఎమ్మెల్యే మనకు దొరకడం మన దురదృష్టమన్నారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి బుద్దిచెబుతారన్నారు. వరంగల్ తూర్పులో బీజేపీ జెండా ఎగర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story