కార్పొరేషన్‌ బండ్లకు తుప్పు..

by Sumithra |
కార్పొరేషన్‌ బండ్లకు తుప్పు..
X

వరంగల్‌ మహానగరపాలక సంస్థ పాలన పూర్తిగా గాడితప్పిందనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. అధికారులు, పాలకులు మారిన కొద్దీ వ్యవస్థలో మార్పు రాకపోగా మరింత దిగజారిపోతోంది. కీళ్లవాతం వచ్చినట్లు కీలక శాఖల అధికారుల తీరుతో పరిపాలన మొత్తం పడకేసే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. నగర సుందరీకరణలో ప్రధానమైన పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అటకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్‌ బల్దియాలోని మొత్తం మూడొంతుల్లో రెండొంతుల వాహనాలు మూలనపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వందకు చేరువలో వాహనాలు హన్మకొండలోని రిపేరు షెడ్డులో మూలుగుతున్నాయి. అంతేకాక కొన్ని వాహనాలు నేడో రేపో షెడ్డుకు చేరుకునేలా ఉన్నాయి. కాలం వెళ్లదీస్తున్న మరికొన్ని వాహనాలు కూడా అదేబాట పట్టే అవకాశం ఉన్నట్లు బల్దియాలో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది. అయితే గత ఈఈ సంజయ్‌ అప్రూవ్‌ చేసిన 132 వాహనాల మరమ్మతులకు రూ.1.50కోట్ల మేర అవసరం పడతాయని తెలుస్తోంది. ఆ నిధుల కోసం బల్దియా సర్కారుపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించినట్లు తెలుస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా ఆ నిధులు వచ్చాక రిపేర్‌ షెడ్డు నిర్వహణకు టెండర్లు పిలిచి, అవి ఖరారై, వాహనాలు రిపేరయ్యేదెన్నడో బల్దియా అధికారులు, పాలకులే సమాధానం చెప్పాలి. ఈ లోగా ఉన్న వాహనాలకు చిన్నచిన్న రిపేరులైనా పట్టించుకుంటేనే పారిశుధ్య నిర్వహణ పావువంతైనా కొనసాగుతుంది. లేదంటే వరంగల్‌ మహానగరం చెత్తకుప్పలాగా మారే అవకాశం లేకపోలేదు.

దిశ, వరంగల్‌ టౌన్ : వరంగల్‌ మహానగరపాలక సంస్థ పాలన పూర్తిగా గాడితప్పిందనే ఆరోపణలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అధికారులు, పాలకులు మారిన కొద్దీ వ్యవస్థలో మార్పు రాకపోగా మరింత దిగజారిపోతోంది. కీళ్లవాతం వచ్చినట్లు కీలకశాఖల అధికారుల తీరుతో పరిపాలన మొత్తం పడకేసే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. నగర సుందరీకరణలో ప్రధానమైన పారిశుధ్య నిర్వహణ పూర్తిగా అటకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్‌ బల్దియాలోని మొత్తం మూడొంతుల్లో రెండొంతుల వాహనాలు మూలనపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వందకు చేరువలో వాహనాలు హన్మకొండలోని రిపేరు షెడ్డులో మూలుగుతుండగా, కొన్ని వాహనాలు నేడో రేపో షెడ్డుకు చేరుకునేలా ఉన్నాయి. కాలం వెళ్లదీస్తున్న మరికొన్ని వాహనాలు కూడా అదేబాట పట్టే అవకాశం ఉన్నట్లు బల్దియాలో బాహాటంగానే ప్రచారం జరుగుతోంది.

సగానికి ఎక్కువ సమస్యలే..!

బల్దియా మొత్తంలో 558కి పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 395 బల్దియా నిర్వహణలో సేవలందిస్తున్నాయి. మిగతా 163 వాహనాలు ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌ పద్ధతిలో నడుస్తున్నాయి. ఇక 395 వాహనాల్లో ఇప్పటికే 73 వాహనాలు రిపేరు షెడ్డుకు చేరుకున్నాయి. అందులో 8 కాంపాక్టర్లు, 3 డంపర్‌ ప్లేసర్లు, 3 ఎక్స్‌కవేటర్లు, 8 జేసీబీలు, 32 స్వచ్ఛ ఆటోలు, 12 స్వీపింగ్‌ యంత్రాలు, 6 ట్రాక్టర్లు, ఒక టిప్పర్‌ ఉన్నాయి. ఇవి పూర్తిగా మరమ్మతులకు కూడా నోచుకోని దుస్థితికి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవి కాక మరో 132 వాహనాలు రిపేరు కోసం ఎదురు చూస్తున్నాయి. ఆయా వాహనాల మరమ్మతుల కోసం ఆన్‌లైన్‌లో కూడా రికార్డు చేసి ఉన్నాయి. ఇవేకాక మరో 60 వాహనాలు కూడా నేడో రేపో అన్నట్లుగా ఉన్నాయనే ఫిర్యాదులు డ్రైవర్ల నుంచి అధికారులకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా 395 వాహనాల్లో 265 మరమ్మతులకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే మిగిలిన 130 వాహనాలతోనే ట్రైసిటీస్‌లో పారిశుధ్య నిర్వహణ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మూడు నెలల కిందటే..!

ఇదిలా ఉండగా హన్మకొండలోని రిపేరు షెడ్డు నిర్వహణ కాంట్రాక్ట్‌ మూడు నెలల కిందటే ముగిసినట్లు తెలుస్తోంది. ఈ విషయం అటు పాలకులకు, ఇటు అధికారులకు తెలిసినా గడువులోగా కాంట్రాక్ట్‌ పొడిగించడమో, కొత్త వారికి అప్పగించడమో చేయకుండా చేతులు ముడుచుకున్నారు. ఒక పక్క 73 వాహనాలు షెడ్డులో మూలుగుతుండగా, 132 వాహనాల రిపేరు కోసం అప్పటి ఈఈ సంజయ్‌ అప్రూవల్‌ ఇచ్చారు. ప్రస్తుతం మరో 60 రిపేరుకొచ్చాయనే ఫిర్యాదులున్నా ప్రస్తుత డీఈ పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అటు పాలకులు, ఇటు అధికారుల తీరుతో బల్దియా వాహన వ్యవస్థ తుక్కుగా మారుతుందేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంజినాయిల్‌ మార్చే ఇంగీతం లేక !

వాహనాల మెయింటెనెన్స్‌ లేకే రిపేరుకు చేరుకుంటున్నాయని డ్రైవర్లు నిర్మోహమాటంగా చెబుతున్నారు. అదీగాక పూర్తిగా పనికిరాక పక్కన పెట్టినట్లు చెబుతున్న 73 వాహనాల్లో 32 స్వచ్ఛ ఆటోలు మినహా, మిగతా 41 వాహనాలకు కనీసం ఇంజినాయిల్‌ కూడా మార్చలేదని తెలుస్తోంది. వాటికి దాదాపు రెండేళ్లుగా ఇంజినాయిల్‌ పోయకపోవడంతోనే దెబ్బతిన్నాయని డ్రైవర్లు పేర్కొంటున్నారు.

కోటిన్నర కోసం కోటి ఆశలతో...

మొత్తానికి చెడిపోయిన 73 వాహనాలు.. గత ఈఈ సంజయ్‌ అప్రూవ్‌ చేసిన 132 వాహనాల మరమ్మతులకు రూ.1.50కోట్ల మేర అవసరం పడతాయని తెలుస్తోంది. ఆ నిధుల కోసం బల్దియా సర్కారు పైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించినట్లు తెలుస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా, ఆ నిధులు వచ్చాక.. రిపేర్‌ షెడ్డు నిర్వహణ టెండర్‌ పిలిచేదెన్నడు ? ఖరారయ్యేదెన్నడు ? వాహనాలు రిపేరయ్యేదెన్నడో ? బల్దియా అధికారులు, పాలకులే సమాధానం చెప్పాలి. ఈ లోగా ఉన్న వాహనాలకు చిన్నచిన్న రిపేరులైనా పట్టించుకుంటేనే పారిశుధ్య నిర్వహణ పావువంతైనా కొనసాగుతుంది. లేదంటే మొత్తానికి మొత్తం వరంగల్‌ మహానగరం చెత్తకూపంగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

Advertisement

Next Story

Most Viewed