జనగామ మున్సిపాలిటీలో ముదిరిన అసమ్మతి

by sudharani |   ( Updated:2023-04-13 17:10:25.0  )
జనగామ మున్సిపాలిటీలో ముదిరిన అసమ్మతి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : జనగామ మునిసిపాలిటీలో రాజ‌కీయ సంక్షోభం ముదిరిపాక‌న ప‌డింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ జనగామ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్‌ల‌పై 19 మంది కౌన్సిల‌ర్లు అవిశ్వాసాన్ని ప్రక‌టిస్తూ శుక్రవారం జిల్లా అద‌న‌పు క‌లెక్టర్ ప్రఫుల్ దేశాయికు విన‌తిని అంద‌జేశారు. క‌లెక్టర్ శివ‌లింగ‌య్య కార్యాల‌యంలో అందుబాటులో లేక‌పోవ‌డంతో అద‌న‌పు క‌లెక్టర్‌కు అంద‌జేసిన‌ట్లుగా అస‌మ్మతి కౌన్సిల‌ర్లు మీడియాకు తెలిపారు. వెంట‌నే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ‌పెట్టేందుకు స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విన‌తిలో పేర్కొన్నట్లు వెల్లడించారు.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ‌పెట్టేందుకు 16 మంది స‌భ్యుల‌తో కూడిన కోరం అవ‌స‌రం కాగా, 11 మంది అధికార పార్టీ అసమ్మతి కౌన్సిల‌ర్లకు 8 మంది కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు మ‌ద్దతు ప్రక‌టిస్తూ అద‌న‌పు క‌లెక్టర్‌కు అంద‌జేసిన విన‌తిలో సంత‌కాలు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో జ‌న‌గామ మునిసిపాలిటీ ప‌రిధిలోని 30 మంది కౌన్సిల‌ర్లలో 19 మంది అసంతృప్తిని వ్యక్తం చేయ‌డంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెట్టడం ఖాయంగానే క‌నిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. గ‌త వారం రోజులుగా 11 మంది అధికార పార్టీ కౌన్సిల‌ర్లు, వారి కుటుంబ స‌భ్యులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పిలుపుతో చ‌ర్చలు కూడా సాగించారు. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన హామీల‌తో సంతృప్తి ప‌డని కౌన్సిల‌ర్లు గురువారం మ‌ధ్యాహ్నామే క‌లెక్టర్ క‌లిసేందుకు ప్రయ‌త్నించి చివ‌ర్లో విర‌మించుకున్నారు. అయితే శుక్రవారం అంతా అనుకున్నట్లుగానే క‌లెక్టర్‌ను క‌లిసేందుకు ప్రయ‌త్నించినా, అందుబాటులో లేక‌పోవ‌డంతో అద‌న‌పు క‌లెక్టర్‌కు విన‌తిని అంద‌జేశారు. మొత్తంగా కౌన్సిల‌ర్ల తిరుగుబావుటా జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

Advertisement

Next Story