పార్టీ మారే ఎమ్మెల్యేలపై ‘వార్’.. ఇక BRS లీగల్ ఫైట్

by Rajesh |
పార్టీ మారే ఎమ్మెల్యేలపై ‘వార్’.. ఇక BRS లీగల్ ఫైట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కారు దిగే ఎమ్మెల్యేలపై లీగల్ ఫైట్‌కు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు సైతం వెళ్లి వారిని అనర్హులుగా ప్రకటించే వరకు పోరాడాలని భావిస్తోంది. అందుకోసం లీగల్ బృందంతో తీవ్ర కసరత్తు చేస్తోంది. గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అనుసరించి పార్టీ మారే వారిపై పిటిషన్లు వేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు ఇచ్చింది. మరొకరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

ఒక్కొక్కరుగా కారు దిగుతున్న ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు సొంతపార్టీ ఎమ్మెల్యేలే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో? తెలియని పరిస్థితి నెలకొంది. ఉన్నదే తక్కువ. అయినప్పటికీ రోజుకో ఎమ్మెల్యే ఊహించని విధంగా పార్టీ మారుతూ షాక్ ఇస్తున్నారు. ఇలాగే వదిలేస్తే పార్టీ మనుగడకు కష్టమని పార్టీ అధినేత భావిస్తున్నారు. వారికి చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే లీగల్‌గా కోర్టులకు వెళ్లి కట్టడి చేయాలని భావిస్తున్నారు. పార్టీని వీడిన ప్రతి ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ వేయాలని కోర్టుకు ఎక్కేందుకు పార్టీ లీగల్ టీంను సన్నద్ధం చేస్తోంది.

హైకోర్టు తీర్పును బట్టి అత్యున్నత న్యాయస్థానానికి

గులాబీ పార్టీని తొలుత వీడిన ఖైరతాబాద్ దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పార్టీ మారిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం హస్తం గూటికి చేరడంతో వారిపైనా పార్టీ కోర్టుకు వెళ్లింది. బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని అనర్హత వేటు వేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ జరుగనున్నది. కోర్టు తీర్పును బట్టి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. నాగేందర్‌తో పాటు పార్టీ మారిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇంకా ఎవరైనా పార్టీ మారితే ఆ ఎమ్మెల్యేల‌పైన ఒకేసారి వెళ్లాలని, అందుకోసం అన్నింటిని సిద్ధం చేయాలని సోమభరత్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ లీగల్ టీంకు అధినేత ఆదేశించినట్టు సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలపై సర్వత్రా ఆసక్తి

దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి 3 నెలలు పూర్తికానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతోనూ పార్టీ అధినేత ఫాం హౌజ్‌లో చర్చిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌తో పాటు మరికొందరు సీనియర్ లీడర్లు సైతం ఈ చర్చల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉన్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆ తీర్పులోని పేరా నం.30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కట్టడికి ప్రయత్నాలు

హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఒకపార్టీలో గెలిచి మరోపార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. దీంతో కోర్టు తీర్పును పూర్వపరాలను, కేసు వేసిన దగ్గర నుంచి అనర్హత వేటు పడే వరకు జరిగిన పరిణామాలన్నింటినీ క్రోడీకరించే పనిలో బీఆర్ఎస్ అధిష్ఠానం నిమగ్నమైంది. ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. భవిష్యత్‌లో ఎవరూ పార్టీ మారకుండా బీఆర్ఎస్ పక్కా వ్యూహరచనతో ముందుకు వెళ్తోంది. అదే విధంగా ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు పార్టీ అధిష్ఠానానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. వారిపైనా కోర్టుకు వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీల కట్టడికి పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయోననేది పార్టీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed