Demolition : కుటుంబం దైవ దర్శనానికి...అధికారులు కూల్చివేతకు...

by Sridhar Babu |
Demolition : కుటుంబం దైవ దర్శనానికి...అధికారులు కూల్చివేతకు...
X

దిశ, కూకట్​పల్లి : ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లారు. ఇదే సమయంలో ఆ ఇల్లు అక్రమం అంటూ జీహెచ్​ఎంసీ అధికారులు తలుపులు పగలగొట్టి కిటికీలు, స్లాబ్​ ను కూల్చి (Demolition) వేశారు. ఈ సంఘటన మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడిచిన తరువాత జీహెచ్​ఎంసీ అధికారులు నిద్ర మత్తు వీడి నిర్మాణం అక్రమం అంటూ కూల్చివేయడం ఏమిటని కాలనీ వాసులు మండిపడుతున్నారు. మూసాపేట్​ సర్కిల్​ పరిధి బాలాజీనగర్​లోని హెచ్​ఐజీ 53లో నిరుపమ రాణి (Nirupama Rani)అనే మహిళ ఐదు అంతస్తుల ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణ పనులు పూర్తయి రెండేళ్లు గడుస్తుంది. అందులో ఐదవ అంతస్తులో ఓ కుటుంబం అద్దెకు ఉంటుంది.

వీరు దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లారు. కాగా శనివారం ఉదయం మూసాపేట్​ టౌన్​ ప్లానింగ్​ అధికారులు ఏసీపీ మల్లేశ్వర్​, టీపీఎస్​ ప్రభావతి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ ఇంటికి ఉన్న తాళాన్ని పగలగొట్టి కంప్రెషర్​, బ్రేకర్​ల సహాయంతో కూల్చివేశారు. స్లాబ్​కు పది ఫీట్ల మేర వరుసగా రంధ్రాలు చేశారు. అపార్ట్​మెంట్​ వాచ్​మెన్​ వేడుకుంటున్నా వినకుండా టౌన్​ప్లానింగ్​ అధికారులు కూల్చి వేసినట్టు స్థానికులు తెలిపారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించకుండా నిర్మాణాన్ని కూల్చి వేసిన అధికారులపై స్థానికులు తిరగబడటంతో అక్కడి నుంచి జారుకున్నారు.

నోటీసులు ఇచ్చారా, డిమాలిషన్​ ఆర్డర్​ కాపీ ఉందా అని మీడియా ప్రతినిధులు కోరగా టీపీఎస్​ ప్రభావతి (TPS Prabhavathi)తమ ఉన్నతాధికారులకే తెలుసని, మాకేం సంబంధం లేదని వెళ్లిపోయారు. కాగా గతంలో ఇక్కడ పని చేసి బదిలిపై వెళ్లిన అధికారి ఈ నిర్మాణానికి ఫ్లోర్​కు ఇంత అంటూ లంచం తీసుకొని పర్మీషన్​ ఇచ్చారని, కొత్తగా వచ్చిన టీపీఎస్​ తనకేంటి అని ఇలాంటి చర్యలకు దిగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తాం

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఓ కుటుంబం నివాసం ఉంటున్న ఇంటిని మూసాపేట్​ టౌన్​ ప్లానింగ్​ అధికారులు కూల్చి వేసి ఇంటిని, ఇంట్లో ఉన్న సమాగ్రిని ధ్వంసం చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed