Illegal immigrants : ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తిప్పి పంపిన అమెరికా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-26 12:05:29.0  )
Illegal immigrants : ప్రత్యేక విమానాల్లో వారిని ఇండియాకు తిప్పి పంపిన అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(America)లో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల(Illegal immigrants)ను ఛార్టర్ ఫ్లైట్స్‌లో తిరిగి భారత్‌కు పంపిస్తున్నట్లు అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపింది. దీనికి భారత ప్రభుత్వం సహకరిస్తుందని, అక్టోబర్‌ 22న ఒక ఛార్టర్డ్ విమానాన్ని భారత్‌కు పంపినట్లు చెప్పింది. చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయులను వేగంగా వారి స్వదేశానికి తరలిస్తామని అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(DHS) ఉన్నతాధికారి క్రిస్టీ ఒక ప్రకటనలో తెలిపారు. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ సహా 145 దేశాలకు చెందిన 1లక్షా 60 వేల మందిని 495 అంతర్జాతీయ విమానాల్లో వారి స్వదేశానికి పంపినట్లు అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. వారిలో భారత్ తో పాటు కొలంబియా, ఈక్వెడార్, పెరూ, ఈజిప్ట్, మారిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్థాన్, చైనా దేశాల పౌరులు ఉన్నారు.

ఈ చర్యలు కఠినమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు చట్టబద్ధమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకేనని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు ఆయా దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించింది. అక్రమంగా అమెరికాలో ప్రవేశించిన వారి పట్ల ఇమిగ్రేషన్‌ చట్టాల ప్రకారమే నడుచుకుంటామని వివరించారు. చట్టబద్ధమైన పద్ధతుల్లోనే విదేశీయులు అమెరికా వచ్చేలా తాము ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలస దారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉంది. మన కంటే ముందు మెక్సికో, ఎల్‌సాల్విడార్ ఉన్నాయి. గత జూన్ నెలలో ది బోర్డర్ ప్రెసిడెన్షియల్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గినట్లు డీహెచ్ఎస్ గుర్తించింది.

Advertisement

Next Story