Skill University: 'మెఘా'కు స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు

by Gantepaka Srikanth |
Skill University: మెఘాకు స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఈ స్కిల్స్ యూనివర్సిటీ(Skills University) భవన నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థ ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ(Megha Company) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ(Skills University) నిర్మాణం చేపట్టనుంది. ఇదే విషయమై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని మెఘా కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వచ్చిన మెఘా కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed