నాయిని, జంగాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు.. ప‌శ్చిమ కాంగ్రెస్‌లో వార్..!

by Rajesh |
నాయిని, జంగాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు.. ప‌శ్చిమ కాంగ్రెస్‌లో వార్..!
X

వరంగల్ ​పశ్చిమ నియోజవకర్గం కాంగ్రెస్​లో కల్లోలం మొదలైంది. హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్​రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవారెడ్డి మధ్య కొనసాగుతున్న కోల్డ్​వార్ ​తారాస్థాయికి చేరుకుంది. వరంగల్ ​పశ్చిమ నుంచే పోటీ చేస్తానని జంగా ప్రకటించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం మొదలైంది. టికెట్ ​పోరు కాస్తా పెరిగి పార్టీ సభ్యత్వ రద్దు వరకూ దారితీసింది. సోమవారం నాయిని రాజేందర్​రెడ్డి ప్రెస్​మీట్​ పెట్టి జంగా పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

క్రమ‌శిక్షణ సంఘం చేసిన సూచ‌న‌లను, తీర్మానాల‌ను ఉల్లంఘించార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి జంగాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. మరో వైపు జంగా సైతం నాయినిపై ఘాటైన విమర్శలు చేశారు. సస్పెండ్​ చేసే అధికారం లేదని, పార్టీ టికెట్లు అమ్ముకున్న చరిత్ర నాయినిదని మండిపడ్డారు. ఇందిర ఇళ్ల బిల్లులు కాజేశాడని, కేయూ భూములు కబ్జా చేశాడని ఆరోపించారు. ఇద్దరు నేత‌ల వ్యవ‌హారం అధిష్టానం పెద్దల వ‌ద్దకు వెళ్లిందని, ఎవరి వైపు అధిష్టానం నిలుస్తుందో వేచి చూడాలి మరి. –దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్‌ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్‌లో క‌ల్లోలం నెలకొంది. కాంగ్రెస్ హ‌న్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని, జ‌న‌గామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘ‌వ‌రెడ్డి మ‌ధ్య టికెట్ వార్ కొన‌సాగుతోంది. ఇద్దరు నేత‌లు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ టికెట్‌పై క‌న్నేసి హాథ్​ సే హాథ్​ జోడో యాత్రతో జ‌నంలోకి దూసుకెళ్తున్నారు. మూడు రోజుల క్రితం యాత్ర ఆరంభంలో కాజీపేటలో జంగా రాఘ‌వ‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే పోటీ చేస్తాన‌ని ప్రక‌టించ‌డంతో నాయిని వ‌ర్గీయులు భ‌గ్గుమ‌న్నారు. ఇదే సీటుపై గంపెడాశ‌లు పెట్టుకున్న నాయిని రాజేంద‌ర్ రెడ్డిని కావాల‌నే డిస్టర్బ్ చేస్తున్నార‌న్నది ఆయ‌న వర్గీయులు చెబుతున్న మాట‌. కాజీపేట ప్రాంతానికి చెందిన తానే లోక‌ల్ క్యాండెట్‌ను అంటూ, త‌న‌కు పోటీ చేసే హ‌క్కు, అవ‌కాశం రెండు ఉన్నాయ‌ని జంగా త‌న వ్యాఖ్యల‌ను కూడా స‌మ‌ర్థించుకున్నారు.

పార్టీ నుంచి జంగా స‌స్పెన్షన్‌..

జంగా వెన‌క్కు త‌గ్గక‌పోవ‌డంతో హ‌న్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష హోదాలో ఆయ‌న ప్రాథ‌మిక స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేస్తున్నట్లు సోమ‌వారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాయిని ప్రక‌టించారు. గ‌తంలోనూ క్రమ‌శిక్షణ సంఘం చేసిన సూచ‌న‌లను, తీర్మానాల‌ను కూడా జంగా ఉల్లంఘించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం అనుమ‌తితోనే జంగాను ప్రాథ‌మిక స‌భ్యత్వం నుంచి తొల‌గిస్తున్నట్లు ప్రక‌టించారు. కాంగ్రెస్ పార్టీకి జంగాకు ఎలాంటి సంబంధం ఉండ‌బోద‌ని కూడా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ర్యాలీలు, పార్టీ కార్యక్రమాల కోసం అనుమ‌తుల‌డిగితే ఇవ్వొద్దని కూడా పోలీస్ శాఖ‌కు స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే నాయిని చేసిన సంచ‌ల‌న ప్రక‌ట‌న ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. జ‌న‌గామ డీసీసీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్న జంగా, గ‌త ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నుంచి పోటీ చేసి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు చేతిలో ఓట‌మి పాల‌య్యారు. అనంత‌రం జ‌న‌గామ డీసీసీ అధ్యక్ష బాధ్యత‌లు చేపట్టడంతో, పొన్నాల వ‌ర్గీయుల‌తోనూ విబేధాలు పొడ‌చూపాయి. జ‌న‌గామ టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌ని కూడా ప‌లుమార్లు ఆయ‌న ప్రక‌టించ‌డం విశేషం. తాజాగా కొద్ది రోజులుగా ఆయ‌న వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే తాను పోటీ చేయ‌ద‌ల్చుకున్నానంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో నాయినికి, జంగాకు ఇద్దరు నేత‌ల అనుచ‌రుల‌కు మ‌ధ్య రాజ‌కీయ పోరు కొన‌సాగుతోంది.

మాట‌ల యుద్ధం..

సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఇద్దరు నేత‌లు మీడియాతో మాట్లాడుతూ ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌ల‌కు దిగారు. జంగా రాఘ‌వ‌రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా ప‌రిస్థితిని త‌యారు చేసేలా కుట్ర చేస్తున్నార‌ని, పార్టీలో ప‌నిచేస్తున్నామ‌నే విష‌యాన్ని మ‌ర్చిపోయి చిల్లర రాజ‌కీయాల‌కు తెగ ప‌డుతున్నాడ‌ని అన్నారు. అదే స‌మయంలో నాయిని రాజేంద‌ర్ రెడ్డి పార్టీ పేరు చెప్పుకుని డ‌బ్బులు సంపాదించుకుంటున్నాడ‌ని ఆరోపించారు.

గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అతడి దగ్గర డబ్బులు తీసుకోలేదా...? దేవరుప్పులలో కాంగ్రెస్ ఎంపీటీసీ బీ ఫామ్స్ రూ.36 లక్షలకు టీడీపీ నాయకుడికి అమ్ముకున్నది నిజం కాదా?, వివిధ జిల్లాల నుంచి పేద విద్యార్థులు ఉన్నత విద్యకోసం కాకతీయ యూనివర్సిటీకి వచ్చి చదువుకుంటారు.

అలాంటి విశ్వవిద్యాలయం భూములను కబ్జా చేసిన చరిత్ర నాయిని రాజేందర్ రెడ్డి కదా ? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేద వాడికి సొంత ఇల్లు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ పథకానికి గండి కొట్టి 5వేల ఇల్లుల బిల్లులు కాజేసింది నాయిని రాజేందర్ రెడ్డి కాదా ? అంటూ ప‌లు తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేశారు. ఇద్దరి నేత‌ల వ్యవ‌హారం అధిష్ఠానం పెద్దల వ‌ద్దకు వెళ్లింది. అధిష్ఠానం ఎవ‌రిని నిందిస్తుందో, ఎవ‌రి వైపు నిలుస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed