'కేసీఆర్ అప్పుడే ఢిల్లీ సుల్తాన్ అయినట్లు ఫీలైపోతున్నాడు'

by GSrikanth |   ( Updated:2022-10-18 12:20:43.0  )
కేసీఆర్ అప్పుడే ఢిల్లీ సుల్తాన్ అయినట్లు ఫీలైపోతున్నాడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని పగటి కలలతో కాలక్షేపం చేస్తున్నాడని బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి మండిపడ్డారు. మొన్నే పేరు మార్చిన బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చేసినట్టు అప్పుడు తను ఢిల్లీకి సుల్తాన్ అయిపోయినట్టు కేసీఆర్ ఫీలైపోతున్నారని సెటైర్లు వేశారు. మంగళవారం సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆమె కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏమీ చెయ్యలేని ఈ పెద్దమనిషి ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా తీరక లేకుండా రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో ఎవరికీ తెలియకపోగా జ్వరం వచ్చినట్లు అక్కడే తిష్టవేసి, తెలంగాణ వ్యవహారాలపై ప్రేమ కారిపోతున్నట్లు సీఎస్, డీజీపీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ తో పాటు ఇంకొందరు ఉన్నతాధికారులను ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారని మండిపడ్డారు. నిజంగా కేసీఆర్ అంతగా కదల్లేని పరిస్థితుల్లో ఉంటే ఆసుపత్రిలో ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. అంతగా రాష్ట్ర అధికారులతో మాట్లాడాలనుకుంటే ఆన్ లైన్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా ఆదేశాలివ్వవచ్చని అన్నారు.

అలా కాకుండా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తన కోసమే కాకుండా అధికారుల విమాన యాత్రలు, వసతి కోసం దుర్వినియోగం చేస్తున్నారని, ఇది ఎవడబ్బా సొమ్మని ఇలా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కాం తన పీకకి పట్టుకుంటుందనే భయం ఒకవైపు... మునుగోడులో బీఆరెస్ (టీఆరెస్) ఓటమి తప్పని వాతావరణం మరోవైపు... ఇక బీఆర్ఎస్ బీటలు వారక తప్పని పరిస్థితుల్లో ఏర్పడ్డాయని అన్నారు. ఇలాంటి టైమ్ లో కనీసం ఢిల్లీ నుంచి దేశాన్ని పాలిస్తున్నానన్న ఫీల్ కోసం ఈ నయా నిజాం కేసీఆర్ పడుతున్న ఈ పాట్లు, పోకడ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

Advertisement

Next Story