Kaleshwaram: కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్.. అడుగడుగునా నిర్లక్ష్యమే

by Rani Yarlagadda |   ( Updated:2024-10-29 03:07:58.0  )
Kaleshwaram: కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్.. అడుగడుగునా నిర్లక్ష్యమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మూడు బ్యారేజీలకు నష్టం ఎందుకు జరిగిందో ఇప్పటికీ స్పష్టత రాలేదు. జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ టెక్నికల్ అంశాలపై ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్ల నుంచి వివరాలను రాబడుతున్నది. ప్రావీణ్యం ఉన్న నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ నిపుణుల నుంచీ వివరాలను సేకరిస్తున్నది. తుది రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నది. సరిగ్గా ఇదే సమయంలో స్టేట్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు చేసి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ వివరాలు కొన్ని కమిషన్‌కు కూడా అందాయి. అందులో అనేక కీలకమైన అంశాలను విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించినట్లు ఇరిగేషన్ వర్గాల సమాచారం. బ్యారేజీల నిర్మాణానికి రీ-ఇన్‌ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్ డయాఫ్రం వాల్ పద్ధతిని ఎంచుకోవాలంటూ వ్యాప్కోస్ సూచించినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీకెంట్ పైల్స్ పద్ధతిని ఎంచుకోవడం ప్రధాన కారణాల్లో ఒకటని ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. ఇంజినీరింగ్ తప్పిదాలే కొంప ముంచాయని, సీకెంట్ పైల్స్ నిర్మాణంతో ఖర్చు తగ్గుతుందని పేర్కొంటూనే రివైజ్డ్ ఎస్టిమేట్స్ పేరుతో అంచనా వ్యయాన్ని పెంచిందని పేర్కొన్నట్లు తెలిసింది. సీకెంట్ పైల్స్ సిస్టమ్‌ను దేశంలో ఏ ప్రాజెక్టుకూ వాడలేదని, అయినా రాష్ట్ర ప్రభుత్వం దానికి మొగ్గు చూపడంపై సందేహాలు వెలిబుచ్చింది. హైడ్రాలిక్ స్ట్రక్చర్లకు వాడకున్నా సరైన గైడ్‌లైన్స్ లేకపోయినా వాటికే సర్కారు సై అనడాన్ని విజిలెన్స్ తన రిపోర్టులో ప్రస్తావించింది. తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చి ల్యాబ్ (టీజీఈఆర్ఎల్) నిర్వహించిన జియో టెక్నికల్ పరీక్షలతోపాటు జాదవ్‌పూర్ యూనివర్శిటీ, సర్‌దీప్ కన్సల్టింగ్ ఇంజినీర్స్ అనే సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో మేడిగడ్డ లొకేషన్‌లో కోల్ బెడ్ ఉన్నట్లు తేలినా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్నే ఖరారు చేసిందనే అంశాన్నీ విజిలెన్స్ డీజీ ఆ నివేదికలో పేర్కొన్నారు. సీకెంట్ పైల్స్ ను సరిగ్గా నిర్వహించలేని (హ్యాండిల్ చేయలేని) కారణంగానే బ్యారేజీకి నష్టం జరిగినట్లు పేర్కొన్నదని ఇరిగేషన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. వ్యాప్కోస్ రూపొందించిన డిజైన్లలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పలుమార్లు మార్పులు చేయడం కూడా బ్యారేజీకి నష్టాన్ని తెచ్చిపెట్టిందని, దీనికి తోడు నిర్మాణ సంస్థ కూడా డిజైన్ విషయంలో జోక్యం చేసుకున్నట్లు ఆ రిపోర్టులో విజిలెన్స్ వింగ్ పేర్కొన్నది.

సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే..

మేడిగడ్డ లొకేషన్‌లో సీకెంట్ పైల్స్ ఎంపికతోపాటు డిజైన్‌లో చేరిన మార్పులు సరిపోవని తెలిసినా ప్రభుత్వం దానికే సమ్మతి తెలిపిందనే అంశాన్ని ప్రస్తావించింది. కోల్ బెడ్ ఉన్న ప్రాంతంలో ఇంజినీర్లు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో నష్టం జరిగినట్లు పేర్కొన్నది. మరోవైపు డిజైన్, డ్రాయింగ్ మొదలు నిర్మాణం, నిర్వహణ వరకు అడగడుగునా ఇంజినీర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, మేడిగడ్డలో 2019 వరదల సమయంలో లోపాలు, తప్పిదాలు బయటపడినా అప్పటి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం మరింత నష్టానికి దారితీసిందని ఆ రిపోర్టు పేర్కొన్నది. కనీస స్థాయిలో చర్యలు తీసుకుని పకడ్బందీగా మెయింటెనెన్స్ చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింధి. కాంట్రాక్టు ఏజెన్సీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం తరఫున అధికారులు, పాలసీ మేకర్స్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది. బ్యారేజీ నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకముందే సబ్‌స్టాన్షియల్ సర్టిఫికెట్ ఇష్యూ చేయడాన్ని ఎత్తిచూపింది. ఇంకోవైపు కాంట్రాక్టు ఏజెన్సీ నుంచి రిక్వెస్టు వచ్చిన వెంటనే బ్యాంకు గ్యారంటీలను ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టింది. చివరకు బ్యారేజీ నాణ్యతపై ఫీల్డ్ లెవల్‌లో తనిఖీలు చేసి సర్టిఫై చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ వింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నది.

విజిలెన్స్ రిపోర్ట్!

ఇంజినీర్లు, రిటైర్డ్ ఆఫీసర్లతో జస్టిస్ ఘోష్‌ ఒకవైపు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సమయంలోనే విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గత వారం సమావేశమై తుది నివేదికను సమర్పించడంపై చర్చించుకున్నారు. ప్రభుత్వానికి రెండు రోజుల క్రితమే ఫైనల్ రిపోర్టును సమర్పించినట్లు ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. టెక్నికల్ అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్‌తో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన రామగుండం రిటైర్డ్ ఈ-ఇన్-సీ నల్లా వెంకటేశ్వర్లు నుంచి కూడా జస్టిస్ ఘోష్ సీకెంట్ పైల్స్ విషయమై లోతుగా ఆరా తీశారు. అప్పటి ప్రభుత్వ పెద్దల (పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు) పేర్లను ప్రస్తావించి డిజైన్లలో మార్పులకు వారే కారణమని, వారి తీసుకున్న నిర్ణయం ప్రకారమే బ్యారేజీల నిర్మాణం జరిగిందని వెల్లడించారు. ఇదే సమయంలో విజిలెన్స్ డిపార్టుమెంటు సైతం డ్యామేజీకి కారణం సీకెంట్ పైల్స్ నిర్ణయమేనని పేర్కొనడం గమనార్హం.

Also Read: మాస్టర్ మైండ్ కేసీఆరే..! కమిషన్ విచారణలో సారు గురించి సంచలన విషయాలు

Advertisement

Next Story

Most Viewed