ఆ విషయంలో అప్రమత్తమైన కేసీఆర్.. కలెక్టర్లకు కొత్త టాస్క్?

by GSrikanth |
ఆ విషయంలో అప్రమత్తమైన కేసీఆర్.. కలెక్టర్లకు కొత్త టాస్క్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతుండటంతో ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలు గతం కంటే ఈ సారి మరింత కష్టతరం కానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అధికార పార్టీపై వ్యతిరేకత తగ్గేలా సీఎం కేసీఆర్ తనదైన ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లకు వీక్లీ ప్రయార్టీ బేస్‌లో టాస్క్‌లు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది కాలం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రభుత్వ వ్యతిరేకతను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేలా ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రజల అసంతృప్తి అంశాలే టార్గెట్:

2014 నుంచి రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈదపా విజయం సాధించాలంటే కేసీఆర్‌కు అంత సులువైనపనేమి కాదనే చర్చ జరుగుతోంది. అనేక అపరిష్కృత సమస్యలతో ప్రజలు టీఆర్ఎస్‌పై ఆగ్రహంతో ఉన్నారని ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిశోర్ చేత నిర్వహించిన సర్వేలో తేటతెల్లం అయిందనే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తిపొడుస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి అలర్ట్ అయ్యారని.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల వల్ల ప్రజాగ్రహం రెట్టింపు కాకుండా కట్టడి చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. అందులో భాగంగా దృష్టి పెట్టాల్సిన ప్రాధాన్యత అంశాలను కలెక్టర్లకు సూచించాలని ముఖ్యమంత్రి సీఎస్‌తో చెప్పగా ఆ అంశాలతో కూడిన లేఖను సీఎస్ సోమేష్ కుమార్ ఆదివారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

లేఖలోని అంశాలు ఇవేనా?

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతున్న అంశాలే టార్గెట్‌గా కలెక్టర్లకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు, భూమి మరియు ధరణి పోర్టల్‌తో సహా పోడు భూ వివాదాల పరిష్కారం, ఆసరా పింఛన్ల పంపిణీని వేగవంతం చేయడం, పెండింగ్‌లో ఉన్న జిఓ 59 భూ క్రమబద్దీకరణ దరఖాస్తులను క్లియర్ చేయడం, పట్టాదారు పేర్లు, భూ విస్తీర్ణంలో సవరణలకు సంబంధించి ధరణి పోర్టల్‌లోని టిఎం 33 కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలను, నిషేదిత ఆస్తులు వంటి అంశాలను ఈ వారానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలుగా సీఎస్ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌ ​ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించడం అలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడటం వంటి అంశాలను సైతం ప్రయార్టీ లిస్ట్ లో సీఎస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రతి వారం సీఎస్ పంపించే అంశాలపై తీసుకున్న చర్యలేంటో నివేదికల రూపంలో తిరిగి పంపాలని వాటిని ముఖ్యమంత్రి దృష్టికి సమర్పించబడతాయని పేర్కొంటూ నిర్దిష్టమైన ఫార్మాట్ ను సైతం లెటర్ లో పొందుపరిచినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేకతను తొలగించాలని భావిస్తున్న కేసీఆర్ తాజా నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed