Kishan Reddy: కులగణనకు మేము వ్యతిరేకం కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన

by Gantepaka Srikanth |
Kishan Reddy: కులగణనకు మేము వ్యతిరేకం కాదు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కుల గణన(Caste Census)కు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. అయితే సర్వే ప్రశ్నావళిలో భాగంగా వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అమీర్ పేటలో సోమవారం ఆయన జితేందర్ రెడ్డి సినిమా(Jitender Reddy movie)ను పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను బీజేవైఎంలో ఉన్న సమయంలో తనతో పాటు పని చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి అని కొనియాడారు. జగిత్యాల పరిసర ప్రాంతాల్లో పేదల పక్షాన నిలబడి జాతీయవాదం కోసం పోరాడారని గుర్తుచేశారు. వరంగల్ లో బీజేవైఎం నిర్వహించిన బహిరంగ సభకు దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ వచ్చిన సందర్భంగా సుమారు 50 బస్సుల్లో జగిత్యాల నుంచి జనాన్ని తరలించి సభను జయప్రదం చేశారని గుర్తుచేశారు. తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా వెనుకడుగు వేయని ధైర్యవంతుడని కొనియాడారు. హింస ద్వారా ఏమీ ఉపయోగం లేదని తెలిసినా తన మద్దతుదారులను కాపాడుకునేందుకు జితేందర్ రెడ్డి తుపాకీ పట్టాల్సి వచ్చిందన్నారు.

ఇప్పుడు కూడా కొందరు తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని భావిస్తున్నారని చురకలంటించారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని అంబేద్కర్ చెప్పారన్నారు. నక్సలైట్లు 72 బుల్లెట్లను జితేందర్ రెడ్డి శరీరంలో దింపారన్నారు. జితేందర్ రెడ్డి సినిమాను నక్సలైట్లు కూడా చూడాలని, అమాయకుల ప్రాణాలు తీసే హక్కు వారికెక్కడిదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఎంతో మందిని వారు హత్య చేశారని, గిరిజనులను కూడా హత్య చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలని ఆయన కోరారు. నక్సలైట్లు హింసను వదిలేసి ప్రజాస్వామ్యంలోకి రావాలన్నారు. హింస వల్ల అమాయకులు ఎందుకు చావాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదిలా ఉండగా పికెట్ కేంద్రీయ విద్యాలయలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి కేంద్రీయ విద్యాలయం ఇక మినీ ఇండియాలాంటిదని కొనియాడారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ మాతృభాషల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన మహారాష్ట్రకు పయనమయ్యారు. అక్కడ ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకోనుంది. ఈనేపథ్యంలో ముంబైలో ఆయన మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కాగా రేవంత్ కు కౌంటర్ గా మహారాష్ట్రలో కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed