కేసీఆర్ పాలన అంకెల గారడీ.. కాంగ్రెస్ పాలన మాటల గారడీ

by GSrikanth |
కేసీఆర్ పాలన అంకెల గారడీ.. కాంగ్రెస్ పాలన మాటల గారడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, మరి రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ అని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. వారిచ్చిన ఎన్నికల వాగ్ధానాల కోసం చెప్పిందేమీ లేదని ఆయన అన్నారు. వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా నీటిమీద రాతలేనా? అని ఆయన నిలదీశారు.

కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ.. ఇక అమలుకానట్టేనని ఆయన చురకలంటించారు. వరంగల్‌లో కాంగ్రెస్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని కాంగ్రెస్ బడ్జెట్ చెబుతోందని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను చెత్తబుట్టలో వేశారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి బడ్జెట్‌లో ఎక్కడా చెప్పలేదని, అంటే ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించనట్లేనా అని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన కోసం ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్‌తో లండన్ వరకు వెళ్లిన ముఖ్యమంత్రి.. ఒకసారి గుజరాత్ సబర్మతీ నది వద్దకు వెళ్తే సుందరీకరణ ఎలా చేయాలో అర్థమవుతుందని సెటైర్లు వేశారు.

15 శాతం ఉన్న మైనారిటీలకు రూ.2,200 కోట్లు కేటాయించారని, అదే 50 శాతానికి పైగా ఉన్న బీసీ సంక్షేమానికి రూ.8వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ. 28 వేల కోట్లు ఏమాత్రం సరిపోవని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న అనేక ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారని, మరి నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. రూ. 7,700 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ లెక్కన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్ధానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story