అబద్ధాలు మాట్లాడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారే లేరు: కిషన్ రెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-03-09 11:08:12.0  )
అబద్ధాలు మాట్లాడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారే లేరు: కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాలు మాట్లాడటంలో కల్వకుంట్ల కుటుంబాన్ని మించిన వారు ఎవరు లేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. గురువారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుని తెలంగాణ రాష్ట్ర పరువును ఢిల్లీలో తీశారని అన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఒక మహిళ ఉండటం తానేప్పుడూ చూడలేదన్నారు.

కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే తెలంగాణను మద్యానికి అడ్డాగా మార్చారని ఫైరయ్యారు. ఈ రోజు ప్రెస్ మీట్‌లో మంత్రి కేటీఆర్, కవిత కేంద్రం గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడారని సీరియస్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేబినెట్‌లో ఒక్క మహిళ మంత్రి లేకుండా పాలన చేసిన పార్టీకి.. మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతారా అని నిలదీశారు. మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ నేతలను ముందు ఎంఐఎంను ఒప్పిస్తారా అని ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో కొత్త నాటకానికి కల్వకుంట్ల ప్రభుత్వం తెరలేపిందన్నారు. సానుభూతి కోసం దీక్ష పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు రావడంతోనే మహిళా రిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని విమర్శించారు. రాజ్యసభకు ఒక్క మహిళా ఎంపీని పంపని మీరు మహిళా రిజర్వేషన్ల గురించి ఎలా మాట్లాడుతారని కిషన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై నుండి దృష్టి మర్చలేందుకే ధర్నా నాటకానికి తెరలేపారని.. సీఎం కూతురికి ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టం ఉండదన్నారు. లిక్కర్ స్కామ్ కల్వకుంట్ల కుటుంబానికి, దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అంశమని.. ఇతర రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందా అని నిలదీశారు. మీ అక్రమ వ్యాపారానికి తెలంగాణకు ఎందుకు లింక్ పెడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story