ఉడ్తా టాలీవుడ్! డ్రగ్స్ కేసుల్లో సినీ ఇండస్ట్రీకి లింక్? మరోసారి తెరపైకి ఇష్యూ..

by Ramesh N |
ఉడ్తా టాలీవుడ్! డ్రగ్స్ కేసుల్లో సినీ ఇండస్ట్రీకి లింక్? మరోసారి తెరపైకి ఇష్యూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనల్లో తరచూ టాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తాజా రాడిసన్ పబ్ కేసులో డైరెక్టర్ క్రిష్ పేరు బయటకు రావడం, పోలీసులు ఆయనను నిందితుల జాబితాలో చేర్చడం సంచలనంగా మారింది. 2018లో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు చార్మి, తరుణ్, నవదీప్, రవితేజ తదితరులపై కేసులు నమోదు కాగా పూరీ, తరుణ్‌ల వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు. అందులో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని తేలడంతో సాక్ష్యాధారాలు లేవంటూ మొత్తం 8 కేసుల్లో ఆరింటిని కోర్టు ఇటీవలే కొట్టివేసింది. అయితే ఇటీవలే డ్రగ్స్‌తో ఓ యువతి పట్టుబడగా ఆమె టాలీవుడ్‌కు యువ హీరో లవర్ అంటూ ఊహాగానాలు వినిపించాయి. యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేం షణ్ముక్‌ సైతం రెండురోజుల క్రితం గంజాయితో దొరికాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో మరోసారి టాలీవుడ్ లింక్ వెలుగులోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.

పోలీసులకు క్రిష్ స్టేట్‌మెంట్..

తాజాగా గచ్చిబౌలి రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ బీజేపీ నేత కుమారుడు వివేకానంద్‌తో పాటు అతని ఇద్దరు మిత్రులు, ఓ పెడ్లర్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, నటి లిషి గణేశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీ జరిగిన సమయంలో క్రిష్ అక్కడే ఉన్నాడని నిర్ధారించిన పోలీసులు.. ఎఫ్ఐఆర్‌లో ఆయనను ఏ-8గా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన క్రిష్ తాను రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లింది నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ఫ్రెండ్స్ పిలవడంతో వెళ్లానన్నారు. హోటల్‌లో అరగంటే ఉన్నానని, ఆ తర్వాత డ్రైవర్ రాగానే వెళ్లిపోయానని స్పష్టం చేశారు. ఈ విషయంపై పోలీసులు తనను ప్రశ్నించారని, అక్కడికి ఎందుకు వెళ్లానో.. ఎవరిని కలిశానో పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు క్రిష్ పేర్కొన్నారు.

రాడిసన్ డ్రగ్స్ కేసులో మరోసారి పట్టుబడ్డ నటి, మోడల్ లిషి గణేష్. రెండేళ్ల క్రితం రాడిసన్ హోటల్, మింక్ పబ్ డ్రగ్ కేసులో కల్లపు కుషిత, ఆమె సోదరి కల్లపు లిషి గణేష్ పట్టుబడగా లిషి గణేష్ మరోసారి పేరు తెరపైకి వచ్చింది. ఈ అక్కచెల్లెళ్ళు గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన సమయంలో మేము డ్రగ్స్ తీసుకోలేదు పార్టీకి వచ్చి చీజ్ బజ్జీలు మాత్రమే ఆర్డర్ ఇచ్చామని అన్నారు.

Advertisement

Next Story