హైదరాబాద్ వాహనదారులకు మరో షాక్.. ‘యూటర్న్‌’’ మరింత దూరం!

by Satheesh |   ( Updated:2023-03-27 02:29:02.0  )
హైదరాబాద్ వాహనదారులకు మరో షాక్..  ‘యూటర్న్‌’’ మరింత దూరం!
X

దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు తగ్గించి, వాహనదారులకు ఊరట కల్గించేందుకు సర్కారు చేపడుతున్న చర్యలు తాత్కాలిక ఫలితాలిస్తున్నాయే తప్పా, శాశ్వత ఉపశమనాన్ని కల్గించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిష్నరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నగరంలోనున్న 230 సిగ్నల్ జంక్షన్లలో ఎక్కువ వాహనాలు నిలవకుండా అక్కడక్కడ ఏర్పాటు చేసిన యూటర్న్‌లతో వాహనదారులకు కష్టాలు తప్పటం లేదు.

పోలీసులు తొలుత 40 జంక్షన్లలపై దృష్టి సారించగా, ఆ తర్వాత వీటి సంఖ్యను 60కి పెంచి ఆ జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను అదుపు చేసేందుకు, జంక్షన్లపై వాహనాల భారం పెరిగి కొన్ని సందర్భాల్లో కిలోమీటర్ల పొడువున ఎక్కడి వాహనాలు అక్కడే నిల్చపోతున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పలు రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా యూటర్న్‌లను ఏర్పాటు చేశారు.

కానీ ఈ యూ టర్న్‌లు ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడి వరకు ప్రయాణించి, యూటర్న్ తీసుకుని వెనక్కి వస్తుండటంతో తమపై పెట్రోల్ భారం పడుతుందని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. అంతేగాక, నగరంలోని ఉస్మాయా, గాంధీ ఆస్పత్రులతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటే కనీసం రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి యూ టర్న్ తీసుకుంటే గానీ వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఆస్పత్రికి తరలించలేక పోతున్నట్లు పలువురు నగర పౌరులు వాపోతున్నారు.

దగ్గరే కదా అని రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తే సీసీ కెమెరాలకు చిక్కి జరిమానాలు పడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. ఏ మాత్రం ముందు చూపు లేకుండా ఏర్పాటు చేసిన ఈ యూటర్న్‌ల వల్ల రోడ్డికు ఇటు వైపున్న వారు అటు వైపు వెళ్లాలన్నా, వాహానంపై రెండు కిలోమీటర్ల అనవసరంగా ప్రయాణించాల్సిన దుస్థితి తలెత్తిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, సోమాజిగూడలోని యశోధ ఆస్పత్రి, నిమ్స్, మహావీర్ ఆస్పత్రులున్న ప్రాంతాల్లో కూడా యూటర్న్‌లు కాస్త దగ్గర లేకపోవటం పట్ల ఆస్పత్రులకు వస్తున్న రోగులు, వారి సహాయకులు తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రుల వద్ద అదే దుస్థితి

సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సోమాజీగూడ యశోధ ఆస్పత్రికి వెళ్లాలన్నా, విల్లా మేరీ కాలేజీ వద్దకు వెళ్లి, అక్కడి నుంచి యూ టర్న్ తీసుకుని ఆస్పత్రికి రావల్సి వస్తుంది. మహావీర్ ఆస్పత్రి వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. మహావీర్ ఆస్పత్రి వెనకానున్న ఏసీ గార్డ్స్, రెడ్ హిల్స్, శాంతినగర్, బజార్ ఘాట్ ప్రాంతాల నుంచి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రోగులను తరలించాలంటే మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కిందనున్న యూటర్న్ వరకు వెళ్లి, తిరిగి రావల్సి వస్తుంది.

సరోజినీ దేవి కంటి ఆస్పత్రి కాంపౌండ్ వాల్‌ను ఆనుకుని ఉన్న పోచమ్మబస్తీ వాసులు సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి రావాలన్నా, మాసాబ్ ట్యాంక్ చౌరస్తాకు సమీపంలోనున్న అమ్మవారి గుడి వరకు వెళ్లి, అక్కడ యూ టర్న్ తీసుకుని పాత హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చి, ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది.

అలాగే సీఎం క్యాంప్ ఆఫీసు, బ్లూమూన్, మక్తా నుంచి వచ్చే వారు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలంటే సివిల్ సప్లై ఆఫీసు దాటిన తర్వాత మెట్రో కారిడార్ కింద యూ టర్న్ తీసుకుని వెనక్కి వచ్చి, నిమ్స్ కి వెళ్లాల్సి వస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన ఈ యూ టర్న్ ల కారణంగా గమ్య స్థానానికి చేరేందుకు సమయం ఎక్కువ పడుతుండటంతో పాటు పెట్రోల్ కూడా ఎక్కువ ఖర్చవుతుందని వాహానదారులు వాపోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కూడా చౌరస్తాను మూసి వేసి, అక్కడి నుంచి సమీపంలో ఉన్న మెట్రో కారిడార్ కింద యూ టర్న్ ను ఏర్పాటు చేశారు.

పాదచారులకు ఇక్కట్లు

ప్రతి గంటకు వేలాది వాహ నాలు రాకపోకలు సాగించే మెయిన్ రోడ్లకిరువైపులా ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్పత్రులకు నడుచుకుంటూ వచ్చే పాదచారులకు ట్రాఫిక్ సమస్య మరింత చుక్కలు చూపుతుందంటున్నారు. కొన్ని సందర్భాల్లో రద్దీ జంక్షన్లలో సిగ్నల్ పని చేయకపోవటంతో నలువైపులా నుంచి వాహానాలు దూసుకురావటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఉందని పాదచారులు వాపోతున్నారు.

Advertisement

Next Story