తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తూ.. అమ్మమ్మ, మనవడు అనంతలోకాలకు

by GSrikanth |
తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తూ.. అమ్మమ్మ, మనవడు అనంతలోకాలకు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం అవుతోంది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వంతెనల మీదుగా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివారం తెల్లవారు జామున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వంతెన మీదుగా ప్రవహిస్తున్న వరద ఉదృతిలో షిఫ్ట్ డిజైర్ కారు గల్లంతయింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రిజ్వాన్, నరేష్ అనే ఇద్దరు సురక్షితంగా బయట పడగా గంగ (బుద్ది) (47), మనవడు కిట్టు (2) మృత్యువాత పడ్డారు. వరద నీటిలో చిక్కుకున్న షిఫ్టు కారును జేసీబీతో బయటకు తీయగా అందులో అమ్మమ్మ, మనవడి మృతదేహాలు బయటపడ్డాయి.

తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తూ..

జగిత్యాల జిల్లా చల్‌ గల్‌కు చెందిన గంగ, కిట్టులు ఆదివారం తెల్లవారుజామున కారులో హైదరాబాద్ బయలు దేరారు. హైదరాబాద్‌లో ఉన్న కిట్టు తల్లిని తీసుకొచ్చేందుకు బయలుదేరిన క్రమంలో వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ వద్ద వరద ఉధృతిలో కారు గల్లంతు కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్లిన తనయుడిని విధి విగతజీవిగా మార్చిన ఘటన తెలిసి చల్‌గల్ వాసులు విషాదంలో కూరుకపోయారు. తెల్లవారుజామున ఇంటి నుండి బయలు దేరిన కారు 4.20 నిమిషాల సమయంలో ప్రమాదానికి గురైనట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫాజుల్ నగర్ వంతెన వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ అంచనా వేయకుండా ప్రయాణించడం వల్లే కారు గల్లంతయినట్టుగా అంచనా వేస్తున్నారు. కూతురు కోసం తల్లి, తల్లి కోసం తనయుడు వెల్లి మృత్యువాత పడడం స్థానికులను కలిచి వేస్తోంది.

అప్రమత్తత అవసరం: కలెక్టర్ అనురాగ్ జయంతి

మరో రెండు రోజుల పాటు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, చిన్న పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాగులు, వంకలు దాటే క్రమంలో వరద ఉధృతిని అంచనా వేసి ప్రవాహం తగ్గే వరకు ప్రయాణాలను నిలిపివేసుకోవాలన్నారు. కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 9398684240 నెంబర్‌కు కాల్ చేసి అత్యవసర సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed