KTR : కేటీఆర్ ను కలిసిన టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-20 11:27:19.0  )
KTR : కేటీఆర్ ను కలిసిన టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు(TTD Chairman BR Naidu) నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలను కేటీఆర్ అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన నాయుడును కేటీఆర్ శాలువా కప్పి సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినందుకు బీఆర్ నాయుడుకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ నాయుడుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అలాగే కరీంనగర్ లో ఒకచోట, సిరిసిల్ల రెండు చోట్ల గతంలో శంకుస్థాపన చేసిన టీటీడీ దేవాలయాల నిర్మాణాలు శరవేగంగా పూర్తి అయ్యేలా సహకరించాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధికి టిీటీడీ తరఫున తోడ్పాటు అందించాలని కోరారు. కేటీఆర్ చేసిన విజ్ఞప్తుల పట్ల బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. టీటీడీ తరఫున తెలంగాణ భక్తుల దర్శనాల విషయంలో, అలాగే ఆలయాల నిర్మాణం, అభివృద్ధి విషయంలో తప్పకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు.

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక తన పాలక వర్గం తొలి సమావేశంలోనే బీ.ఆర్.నాయుడు పలు కీలక నిర్ణయాలను తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగులను బదిలీ చేయడం, లేదా వీఆర్ఎస్ కల్పించాలని నిర్ణయించడంతో పాటు శ్రీవాణి ట్రస్టు రద్దు, తిరుప‌తిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయించడం, నిత్య అన్న ప్రసాద భవనం మెనూలో అద‌నంగా మ‌రొక‌ ప‌దార్థాన్ని చేర్చడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

Next Story