ఎనిమిదేళ్లుగా అన్యాయానికి గురవుతున్న మును'గోడు'

by GSrikanth |   ( Updated:2022-10-15 04:10:12.0  )
ఎనిమిదేళ్లుగా అన్యాయానికి గురవుతున్న మునుగోడు
X

విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లు ప్రత్యేక నిధుల విషయంలో పూర్తిస్థాయిలో వివక్షకు గురవుతున్నాయి. సీఎం మేనల్లుడు హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటకు పెద్ద పీట వేస్తూ గడిచిన ఎనిమిదేండ్లలో రూ. 441.50 కోట్లు విడుదల చేసింది. సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ సైతం అభివృద్ధిలో జిగేల్ మంటున్నది. ఈ సెగ్మెంట్ కు రూ. 598.22 కోట్లను విడుదల చేయడం గమనార్హం. ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు కూడా రూ.49.91 విడుదలయ్యాయి. కానీ మునుగోడుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 2.25 కోట్లు ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ ఉపాధి హామీ కింద నిర్మించిన సీసీ రోడ్లకు రూ.1.03 కోట్లు వెచ్చించారు. మిగతా కోటీ 22 లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. విపక్ష శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లపై వివక్ష తీరుకు ఈ గణాంకాలే అద్దం పడుతున్నాయి.


దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం జరిగింది నిజమేనని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఎనిమిదేండ్లలో ఈ నియోజకవర్గ (చౌటుప్పల్ మినహా) అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ఖర్చు పెట్టింది కేవలం రూ. 2.25 కోట్లు. ఇందులో రూ.1.03 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉపాధి హామీ ఫండ్స్ నుంచి డైవర్ట్ చేసింది. మిగిలిన రూ. 1.22 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 మార్చి 26న కోటి రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో (నెం. 173) జారీ చేసింది. పంచాయతీరాజ్ విభాగం సూపరింటెండింగ్ ఇంజినీర్ పర్యవేక్షణలో నియోజకవర్గ పనులు పూర్తయ్యాయి. చండూరు మండలం తుమ్మలపల్లిలోని శ్రీరామలింగేశ్వర ఆలయానికి వచ్చే భక్తుల అవసరార్థం రోడ్లు, తాగునీటి సౌకర్యం, వీధి దీపాలు, మరుగుదొడ్లు, పారిశుధ్య పనులకు ఖర్చు చేసినట్లు అధికారుల సమాచారం. ఆ తర్వాత 2016లో ఒక్క పైసాను కూడా ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ పేరుతో విడుదల చేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని 2017 మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసే చివరి రోజున ఒకే జీవో (నెం. 260)తో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన రూ. 1.03 కోట్ల నిధులతో పూర్తయినవే.

మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి మాత్రం రూ. 22.37 లక్షలను రాష్ట్ర ఖజానా నుంచి 2017 మార్చిలో కేటాయించి ఖర్చు చేసింది. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నిక సందర్భంగా ఈ గ్రామాన్నే సీఎం కేసీఆర్ ఇన్‌చార్జిగా తీసుకోవడం గమనార్హం. లెంకలపల్లిలోని పనులన్నీ ఎస్సీ కేటగిరీ కింద చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పనులన్నీ 2016-17 ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యాయి. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎస్‌డీఎఫ్ పద్దు కింద నిధుల కేటాయింపూ లేదు, అభివృద్ధి పనులకు ఫండ్స్ రిలీజ్ కూడా లేదు. గత ఆర్థిక సంవత్సరం చివరి రోజున (మార్చి 31, 2022) మొత్తం 23 పనులకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసింది. ఇప్పటివరకు ఒక్క పని కూడా మొదలుకాలేదు. మునుగోడు ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఆ కారణంగానే స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ కేటాయింపులు లేకుండా నెట్టుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో కోటి రూపాయలను కేటాయించినా పనులు మొదలుకాకపోవడాన్ని రాజగోపాల్‌రెడ్డి పదేపదే ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ పనులన్నీ జిల్లా పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఇంజినీర్ పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నది. మొత్తం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని పనుల కోసమే ఈ నిధులను కేటాయించినట్లు జిల్లా ప్లానింగ్ విభాగం ద్వారా తెలిసింది.

సిద్దిపేటకు పెద్దపీట

మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌కు మాత్రం ఈ ఎనిమిదేండ్ల కాలంలో భారీ స్థాయిలోనే నిధుల కేటాయింపు, విడుదల, ఖర్చు జరిగింది. రాష్ట్రం ఏర్పడింది మొదలు ఈ ఏడాది మార్చి చివరి వరకు సిద్దిపేటకు ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ పద్దు కింద రూ. 718 కోట్లను కేటాయిస్తే అందులో రూ. 441.50 కోట్లు విడుదలైంది. రూ. 347.91 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం 1,614 పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యాయి. 2019-20లో గరిష్ఠంగా రూ. 210 కోట్లతో 645 పనులు పూర్తిచేసినట్లు జిల్లా అధికారుల వివరాలు స్పష్టం చేస్తున్నాయి.

గజ్వేల్ జిగేల్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సెగ్మెంట్ కు ఎస్‌డీఎఫ్ ఫండ్స్ భారీగానే విడుదలయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం మొదలు ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 650.58 కోట్లు మంజూరైతే అందులో రూ. 598.22 కోట్లు విడుదలైంది. మొత్త, 1,990 పనులకుగాను రూ. 432.47 కోట్లు ఖర్చయింది. 2015-16లో రూ. 143 కోట్లను ఖర్చు చేస్తే 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ. 209 కోట్లు, గెలిచిన తర్వాత రూ. 137.69 కోట్లు ఖర్చయింది.

వెల్లువలా సిరిసిల్లకు

మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లకు సైతం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం భారీగానే నిధులను విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రెండేండ్లలో రూ. 13.69 కోట్లు విడుదలైతే, సిరిసిల్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత 2016-17 నుంచి ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ. 49.91 కోట్లు విడుదలైంది. కేటాయింపులకు తగినట్లుగానే జాప్యం లేకుండా సర్కారు నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ఇప్పటివరకు రూ. 27.04 కోట్లు ఖర్చయింది. ఉమ్మడి జిల్లాలోని ఖర్చుతో కలిపితే మొత్తం రూ. 40.73 కోట్లు ఖర్చయినట్లు అధికారుల సమాచారం. సీఎం కుటుంబానికి చెందిన ముగ్గురి నియోజకవర్గాలకు వందల కోట్ల రూపాయల ఎస్‌డీఎఫ్ నిధులు విడుదలయ్యాయి. మునుగోడుకు రాష్ట్ర ప్రభుత్వం విదిల్చింది కేవలం.. 1.22 కోట్లే కావడం గమనార్హం.

మునుగోడు, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు కేటాయించిన, విడుదలైన, ఖర్చు చేసిన ఎస్‌డీఎఫ్ నిధుల వివరాలు (2014-15 నుంచి 2021-22 వరకు కోట్ల. రూ.లలో). మునుగోడులో ఖర్చుచేసిన మొత్తంలో రూ. 1.03 కేందం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వచ్చినవి. సిరిసిల్ల నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలో భాగంగా ఉన్నకాలంలో ఖర్చయిన రూ. 13.69 కోట్లు అదనం.

ఇవి కూడా చదవండి : మునుగోడులో డాక్టర్ కోమటిరెడ్డి పోటీకి కారణం ఇదే! (వీడియో)

Advertisement

Next Story

Most Viewed