సమ్మర్​ ఎఫెక్ట్.. ట్రాఫిక్ పోలీసుల ఇక్కట్లు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-08 00:16:01.0  )
సమ్మర్​ ఎఫెక్ట్.. ట్రాఫిక్ పోలీసుల ఇక్కట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాఫిక్ ​పోలీసుల పాలిట వేసవి టెరిఫిక్​గా మారింది. వారిపై సమ్మర్ ఎఫెక్ట్​ భారీగా పడింది. నిత్యం విధుల్లో భాగంగా ట్రాఫిక్, దుమ్ము, ధూళితో యుద్ధం చేసేవారు ఇప్పుడు మండుటెండలో చెమట, ఉక్కపోతతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో చాలామంది డీహైడ్రేషన్ ​బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. వేసవిలో ఈ కష్టాలను అధిగమించేందుకు ట్రాఫిక్​ పోలీసులకు కూలింగ్​ గ్లాసులు, హ్యాట్, మజ్జిగ, గ్లూకోన్​డీ వంటివి అందజేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. గతవారం భారీ వడగాల్పులు ఉన్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యశాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా ట్రాఫిక్​ సిబ్బందికి కనీసం మజ్జిగ కూడా అందించకపోవడం దారుణమని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు ట్రాఫిక్ పోలీసులకు ప్రతి ఏటా కూలింగ్ గ్లాసులు, హ్యాట్, మజ్జిగ, గ్లూకోన్​డీ అందించేందుకు బడ్జెట్​ ఉంటుంది. ఇవన్నీ అందించేందుకు ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలు తీసుకుంటారు. అవన్నీ తమ పేరిట వస్తున్నా చేతికి మాత్రం అందడం లేదని, ఏమవుతున్నాయో కూడా అర్థం కావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. సమ్మర్ లో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు డ్యూటీలో ఉన్నవారికి మజ్జిగ అందిస్తారు. కానీ ఈ ఏడాది అది కూడా లేకుండా పోయింది. ట్రాఫిక్​ సిబ్బందికి ప్రతిరోజు మాస్కులు ఇవ్వాల్సి ఉంది. కొవిడ్ సమయంలో అందించిన అధికారులు ఇప్పడు పట్టించుకోవడం లేదు. దీంతో ఎవరికి వారుగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఒక్కో ట్రాఫిక్ సిబ్బందికి అరకిలో చొప్పున కేజీ గ్లూకోన్​డీని అందిస్తున్నారు. ఈసారి ఇప్పటి వరకు అందించలేదు.

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5 వేల మంది ట్రాఫిక్​విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో 70 శాతం మంది గ్రేటర్ ​హైదరాబాద్​లోనే పనిచేస్తున్నారు. ఒక్కో పీఎస్​కు కనీసం 50 మంది ఉంటే అందులో ముగ్గురు, నలుగురు ఉంటారు. గత రెండేండ్లు కొవిడ్​కారణంగా లాక్​డౌన్​సమయంలో ట్రాఫిక్​లేక కాస్త రిలాక్స్​అయినా ఇప్పుడు తీవ్ర కష్టాలు పడుతున్నారు. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. వారు ఇంటినుంచి తీసుకొచ్చిన మంచినీళ్లు అయిపోతే కనీసం తాగేందుకు నీళ్లు అందించే నాథుడు కూడా లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లకు వెళ్లి నీళ్లు నింపుకుని రావాల్సిన పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు. టాయిలెట్ కు వెళ్లేందుకు ట్రాఫిక్​ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా సిబ్బంది పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. కొన్ని సందర్భాల్లో కూడళ్ల వద్ద ఒక్కరినే కేటాయిస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి మంచినీళ్లు, కావాలన్నా, టాయిలెట్లకు వెళ్లాలన్నా ఇబ్బందే. ఆ సమయంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సిబ్బందికి ఇబ్బందులు తప్పవు.

లా అండ్ ​ఆర్డర్ ​పోలీసులకు, ట్రాఫిక్ ​పోలీసులతో పోల్చుకుంటే 30 శాతం అలొవెన్సులు అధికంగా ఉంటాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా చాలా సమయం నిలబడి ఉండటం, దుమ్ము, పొగ కారణంగా మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పితో పాటు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఒక ఉద్యోగి ఉదయం 7:45 కి విధులకు హాజరుకావాలి. రూల్​ ఆఫ్​ కాల్ సమయానికి రాకుంటే ఆలస్యానికి కారణాలను పై అధికారికి రాతపూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. ఉదయం షిఫ్ట్​వచ్చిన సిబ్బంది మధ్యాహ్నం 2 గంటల వరకు విధుల్లో కొనసాగుతారు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన వారు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతారు. ఈ సమయం కారణంగా సకాలంలో భోజనం చేయకపోవడం వల్ల సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షిఫ్ట్​సమయంలో మార్పులు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed