మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ నివాసాలను ముట్టడించిన ట్రిపుల్ ఆర్ రైతులు

by Y. Venkata Narasimha Reddy |
మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్  నివాసాలను ముట్టడించిన ట్రిపుల్ ఆర్ రైతులు
X

దిశ, వెబ్ డెస్క్ : ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని రాయగిరి, గజ్వేల్, చౌటుప్పల్ మండల ప్రాంతాలకు చెందిన ట్రిపుల్ ఆర్ రైతులు(RRR farmers) హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసాలను ముట్టడించారు. మంగళవారం ఉదయమే పెద్ద ఎత్తున మంత్రి ఇంటికి చేరుకున్న రైతులు గేటు బయట ఆందోళన చేపట్టారు. మంత్రి బయటకు రాగానే ఒక్కసారిగా చుట్టిముట్టిన రైతులు ఆయన బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీగా గతంలో అలైన్‌మెంట్ మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ విషయంలో రాష్ట్ర సర్కారు వివక్షను ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్‌ ఆర్‌లో భాగంగా ఉత్తర భాగానికి ఒక విధంగా, దక్షిణ భాగానికి మరోలా వ్యవహరిస్తున్నదని, దక్షిణ భాగంలో అడ్డగోలుగా మార్పులు చేస్తున్న ప్రభుత్వం రాయగిరి అలైన్‌మెంట్‌ మార్చాలని రైతులు పెద్దఎత్తున నినదించారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను రాయగిరి 40 కిలోమీటర్ల అవతల నుంచి తీసుకుపోవాలని, భూమికి బదులుగా భూమి ఇవ్వాలని, లేనియెడల బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారంగా నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందించారు. అయితే ఈ వ్యవహారం నా చేతిలో ఏమీ లేదని.. అంతా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని మంత్రి దాటవేశారు.

అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్న ట్రిపుల్ ఆర్ రైతులు తమ సమస్యను ఆయనకు కూడా ఏకరవు పెట్టారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైన చెల్లించాలని రాజగోపాల్ రెడ్డిని కోరారు.. రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం ఔటర్ రింగ్ రోడ్డు నుండి 40 కిలోమీటర్ల మేర తీసుకున్నారని, ఉత్తరభాగానికి వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్డు నుండి 28 కిలోమీటర్ల దూరం మాత్రమే తీసుకున్నారని వివరించారు. కాగా ఉత్తరభాగం దక్షిణ భాగం జంక్షన్ చౌటుప్పల్ వద్ద వస్తున్న నేపథ్యంలో భూములు ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుందని వీలైతే అలైన్ మెంట్ లో మార్పులు తీసుకురావాలని, అది సాధ్యం కానీ ఎడల భూములు కోల్పోతున్న మాకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎంత ధర అయితే ఉందో అంత ధర చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్చించాలని వేడుకున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను చర్చిస్తానని రీజినల్ రింగ్ రోడ్డు బాధితులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed