Raghunandan Rao: ‘కేటీఆర్.. మీ వీడియోలు బయట పెట్టాలా?’.. రఘునందన్ రావు ఫైర్

by Prasad Jukanti |   ( Updated:2024-10-22 13:29:53.0  )
Raghunandan Rao: ‘కేటీఆర్.. మీ వీడియోలు బయట పెట్టాలా?’..  రఘునందన్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రాకు తాను సపోర్ట్ చేస్తున్నానని మూసీ పరివాహక ప్రాంతంలో ఇటీవల పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. హైడ్రా, మూసీ రివర్ ఇష్యూ ఒకటేనా అనేది అమెరికాలో చదువుకుని వచ్చానని చెబుతున్న కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ముందు తెలుసుకోవాలన్నారు. మంగళవారం అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం గోల్నాక, కృష్ణా నగర్ ప్రాంతాల్లోని మూసీ పరివాహక ప్రాంతంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి కృష్ణాయాదవ్, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతమ్‌రావు తదితరులతో కలిసి రఘునందన్ రావు పర్యటించారు. అక్కడి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ప్రజలను కన్ఫ్యూజ్ చేసి వారిని ఆందోళనల్లో నెడుతున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఒకరిపై మరొకరు బురద జల్లుకునేందుకు ఇది సమయం, సందర్భం కాదు. చేతనైతే పేదల ప్రజల పక్షాన నిలబడదామన్నారు. అంతే తప్ప రఘునందన్ మద్దతుగా మాట్లాడంటూ లేనిపోనివి చెబితే మూసీ విషయంలో నువ్వు, నీఅయ్య మాట్లాడిన వీడియోలు బయటపెడితే సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మూసీకి మొదట మాట్లాడింది, మార్కింగ్ చేసిందే కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యే అయ్యాకేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని శుద్ధి పేరుతో మార్కింగ్ లు చేసినప్పుడు కాలేరు వెంకటేశ్ ఏడ ఉన్నాడని ప్రశ్నించారు.

ఆ విషయం సీఎం చెప్పాలి:

మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపైకి ఒక్క జేసీబీ వచ్చినా వాటికి నూటికి నూరు శాతం అడ్డుగా బీజేపీ కార్యకర్తలు నిలబడి ఒక్క ఇళ్లు కూడా తొలగించకుండా చూస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారన్నారు. అధికారంలో ఉండగా మార్కింగ్ లు ఇచ్చి తొలగిస్తామని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఇక్కడికి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతూ నా పేరు వాడుకుంటున్నారని అందుకే తానే ఇక్కడికి వచ్చాన్నారు. రఘునందన్ రావుగా, మెదక్ ఎంపీగా, బీజేపీ కార్యకర్తగా ఈ ప్రాంత ప్రజలకు తాను ఒక్కటే చెబుతున్నానని ప్రభుత్వం ఏరకమైన మార్కింగ్ వేసినా పేదల ఇండ్లను తొలగించకుండా ఉండేందుకు బీజేపీ కార్యకర్తలు చివరి శ్వాస వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇక్కడి ఇండ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా పరిహారం సరిపోతుందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. మూసీ ప్రాంతంలో మూడు గంటలు ఉండాలని సీఎం అంటున్నారు. ఇక్కడి ప్రజలు 60 ఏళ్లుగా ఉంటున్నారన్నారు. చేతనైతే మూసీని శుద్ధి చేయాలన్నారు. రోడ్డుకు అవతలి వైపు రిటైనింగ్ వాల్ ఏ రకంగా నిర్మించారో ఇటు వైపు కూడా అదే తరహాలో రిటైనింగ్ వాల్ నిర్మించి పేదలను ఆదుకునే ప్రయత్నం చేయాలే తప్ప.. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి పేరుతో కొంత మంది మంత్రులను, జర్నలిస్టులను విదేశాలకు పంపి అందమైన గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేయవద్దన్నారు. ఈరోజు, రేపు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కలిసి అందరి ఆవేదనను వింటామన్నారు. పేద ప్రజల గొంతుకగా బీజేపీ నాయకత్వం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అండగా నిలబడుతుందని ఈ ప్రాంత ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తామన్నారు.

Advertisement

Next Story