KCR ఫ్యామిలీకి ఆ జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత మాదే: రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |
KCR ఫ్యామిలీకి ఆ జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత మాదే: రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత మాదేనని.. ధరణి విషయంలో సీఎం కేసీఆర్ పెద్ద దళారీగా మారారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ధరణిలో ఉన్న దోపిడీ మరెందులోనూ లేదన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి.. ప్రజలకు ఇబ్బందులు లేని పాలసీ తీసుకువస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత ఏడుపు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో భుముల వివరాలను పారదర్శకంగా రికార్డు చేసిందని డిజిటలైజ్ చేసేందుకు 2014లోనే భూభారతి పేరుతో పైలట్ ప్రాజెక్టును సైతం తీసుకువచ్చిందన్నారు.

నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని భూదాన్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లోనూ భూదాన్ భూములు అక్రమార్కులు కాజేస్తే ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై భూదాన్ బోర్డు అక్కడి కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కిషన్ రెడ్డికి సైతం లేఖ రాశారన్నారు.

ధరణి వచ్చాక కేటీఆర్ అనుచరులు రూ.వెయ్యికోట్ల విలువైన భూములు కొట్టేశారని ఆరోపించారు. కలెక్టర్లను కేటీఆర్ కీలు బొమ్మలుగా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు. తిమ్మాపూర్ భూ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలు, పార్టీ ఫిరాయించిన నేతల ప్రమేయం ఉందన్నారు. ఈ భూబాగోతంపై ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ధరణి కారణంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టరేట్ల ముందు వేలాది మందు రైతులు పడిగాపులు కాస్తున్నారని, 30 శాతం కమిషన్ ఇవ్వనిదే ధరణి సమస్యలు పరిష్కారం దొరకడం లేదన్నారు. ధరణి రద్దు చేస్తే రైతు బంధు, రైతు బీమా రాదని కేసీఆర్ తెలంగాణ ప్రజలని గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ధరణి బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉందని, ధరణి రద్దు చేస్తే ఎక్కడ తమ కుట్ర బయట పడుతుందోనని బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేయడంతో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ భూములపై విచారణ జరిపించడంతో పాటు ఈ మూడు జిల్లాల్లో అవినీతికి పాల్పడిన కలెక్టర్లను ఊచలు లెక్క పెట్టించడం ఖాయం అన్నారు. రాష్ట్రంలో 30% కమీషన్ ప్రభుత్వం దిగిపోవాన్నారు.

Advertisement

Next Story