ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

by Satheesh |
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను చంపడమంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖర్గే నాయకత్వాన్ని ఎదుర్కోలేకనే వాళ్ల కుటుంబాన్ని హత్య చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. ఖర్గేతో పాటు అతని కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ బీజేపీ నాయకుడు మణికంఠ రాథోడ్ మాట్లాడిన ఆడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. మణికంఠ రాథోడ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున్ ఖర్గే కుటుంబ సభ్యులను చంపితే అధికారంలోకి వస్తామనుకోవడం బీజేపీ భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు.

“హైదరాబాద్-కర్ణాటక పరిధిలోకి వచ్చే చిత్తాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో మల్లికార్జున ఖర్గే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో సారి ప్రియాంక్ గెలవబోతున్నారు. ప్రియాంక్ మీద పోటీ చేసేందుకు అభ్యర్ధి లేక 30 క్రిమినల్ కేసులు, నగర బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్న రౌడీ షీటర్ మణికంఠ రాథోడ్‌ను నిలబెట్టింది” అని రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని విమర్శించారు. ప్రియాంక ఖర్గేను ఓడించడానికి జాతీయ నాయకులు అందరూ చిత్తాపూర్లో మోహరించారని, కానీ అక్కడ ఆయన పక్కా గెలుస్తాన్నారని నొక్కి చెప్పారు. దేశ భక్తులమనే బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మణికంఠ రాథోడ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని మోదీ, నడ్డాలను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మల్లికార్జున్​ఖర్గే 50 ఏళ్ల నుంచి ప్రజా సేవలో ఉన్నారని, రాష్ట్రమంత్రిగా, కేంద్ర రైల్వే, కార్మిక శాఖ మంత్రిగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి గుల్బార్గా జిల్లాను ఆదర్శంగా తీర్చిద్దారు అని రేవంత్ స్పష్టం చేశారు. 2014-19 మధ్య ఖర్గే లోకసభలో ప్రతిపక్ష నేతగా మోదీ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి ఉక్కిరి బిక్కిరి చేశారన్నారు. అందుకే కక్ష గట్టి అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించి, ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను దుర్వినియోగం చేసి ఖర్గేను ఓడించారన్నారు.

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టాక మొదటి అడుగులోనే హిమాచల్ ప్రదేశ్లో గెలిచామని, రెండో అడుగులో కర్ణాటకలో గెలవబోతున్నామని ధీమాను వ్యక్తం చేశారు. ఈ నెల 10న కర్ణాటక ప్రజలు తమ తీర్పును వెల్లడించబోతున్నారన్నారు. 150 సీట్లతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టాబెట్టాలని అక్కడి ప్రజలు నిర్ణయానికొచ్చినట్లు రేవంత్ పేర్కొన్నారు. ఇక మూడో అడుగులో ఈ డిసెంబర్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని, నాలుగో అడుగులో దేశమంతా గెలిచి ఎర్రకోట మీద కాంగ్రెస్​జెండా ఎగురవేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story