సాయంత్రం భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రేవంత్ రెడ్డి.. మరి ఈటల పరిస్థితేంటి?

by GSrikanth |
సాయంత్రం భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రేవంత్ రెడ్డి.. మరి ఈటల పరిస్థితేంటి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఈటల చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే నిరూపించాలని రేవంత్ సవాల్ విసిరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటలకు రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళనున్నారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ నివాసం నుంచి భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ రూ.25 కోట్లు కాంగ్రెస్‌కు ఇచ్చారని ఆరోపించిన ఈటల రుజువు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు.

దమ్ముంటే ఇద్దరం చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద తడి బట్టలతో ప్రమాణం చేద్దామని చాలెంజ్ చేశారు. ఈటల చేసిన ఆరోపణలను ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ నుంచి గానీ, కేసీఆర్ నుంచి గానీ తాము సాయం పొందలేదన్న రేవంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి కార్యకర్తలు చందాలు చేసినవేనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థికసాయం చేశారని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడారని రేవంత్ ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం ఈటల దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. అయితే రేవంత్ ప్రకటించిన మాటలకు చార్మినార్ వేదిక తేల్చుకునేందుకు సిద్ధం కాగా.. రాజేందర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. వస్తారా? రారా? అనే సందేహం నెలకొంది.

Advertisement

Next Story