నాగర్ కర్నూల్ జిల్లాలో కుండపోత వర్షం..

by Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లాలో కుండపోత వర్షం..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. శనివారం కేవలం అరగంట పాటు కురిసిన నిరవధిక వర్షానికి ఒక్కసారిగా జిల్లా కేంద్రం తడిసి ముద్దయింది. ప్రధాన రోడ్లకుండా మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తూ ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఆటంకం ఏర్పరచింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మురుగు కాలువలు శుభ్రం చేయని కారణంతో మురుగునీరు అంతా రోడ్లపైనే ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి మురుగునీరు చేరింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రైతులు మార్కెట్ కు తీసుకొచ్చిన మొక్కజొన్న, వరి తదితర ధాన్యమంతా తడిసిపోయింది.


జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సైతం నిండుకొని నాలాల గుండా డ్రైనేజీ నీరు పొంగిపొర్లి ఇళ్లల్లోకి చేరడంతో దుర్వాసనతో తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు సైతం నీరు చేరడంతో తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో నాళాలు కబ్జా చేయడంతో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహించింది. పట్టణంలోని పదో వార్డులోనూ ప్రధాన రోడ్డు గుండా చెరువును తలపించేలా వర్షపు నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది సకాలంలో స్పందించి శుభ్రం చేశారు. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో సుమారు మూడు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది.





Advertisement

Next Story