మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి.. కోదండరాం డిమాండ్

by GSrikanth |
మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలి.. కోదండరాం డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించడం దురదృష్టకరమన్నారు. శనివారం ఆపరేషన్లు వికటించి చనిపోయిన వారి కుటుంబాలను కోదండరాం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావిడిగా 34 మందికి ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. ఆపరేషన్లు జరిగిన తర్వాత రోగులకు సరైన మందులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ అసమర్థ పాలనకు ఈ ఘటన ఉదాహరణ అని ఫైర్ అయ్యారు.

వైద్య రంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. ఇలా అయితే మౌళిక సదుపాయాలు ఎలా మెరుగు పడతాయని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఘటనకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని అలాగే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగామాడితే ఊరికోబోయేది లేదని హెచ్చరించిన కోదండరాం.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ESI కుంభకోణంలో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇకనైనా నేషనల్ పాలిటిక్స్ మీద కాకుండా రాష్ట్ర సమస్యలపై కేసీఆర్ దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed