తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..? ఆ తేదీలోపు ఎప్పుడైనా..

by Javid Pasha |   ( Updated:2023-09-28 07:19:28.0  )
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..? ఆ తేదీలోపు ఎప్పుడైనా..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేయగా.. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాయి. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్ వికాస్ రాజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో డిసెంబర్‌లో ఖచ్చితంగా ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 3 నుంచి 6 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్షించనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశం కానున్నారు. ఏర్పాట్లు, భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేయనున్నారు. సీఈసీ సభ్యుల పర్యటనతో అక్టోబర్‌లో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. అక్టోబర్ 10లోపే ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 7న ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఆ తర్వాత నవంబర్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సారి కూడా అక్టోబర్ 10వ తేదీలోపు షెడ్యూల్ రానుందని తెలుస్తోంది. కేంద్ర అధికారుల రాష్ట్ర పర్యటన ముగిసిన తర్వాత సీఈసీకి ఒక నివేదిక సమర్పించనున్నారు. అనంతరం షెడ్యూల్ విడుదల కానుందని సమాచారం. తెలంగాణతో పాటు మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు కూడా ఒకేసారి షెడ్యూల్ విడుదల చేస్తారు.

Advertisement

Next Story