వారికి క్లారిటీ లేదు.. కార్యాచరణ లేదు : నిరంజన్ రెడ్డి

by Sathputhe Rajesh |
వారికి క్లారిటీ లేదు.. కార్యాచరణ లేదు : నిరంజన్ రెడ్డి
X

దిశ, కరీంనగర్ టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రిపై నిరంతరం నిందలు మోపుతున్న ప్రతిపక్ష పార్టీలకు తమ విధానం ఏంటీ అన్న క్లారిటీ లేదని, కార్యాచరణ అంతకన్నా లేకుండా పోయిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ పాలసీలకు భిన్నంగా ఏం చేస్తారో చెప్పకుండా పాదయాత్రల్లో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలు చేస్తున్నవారంతా తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిన వారేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కంటే గొప్ప పాలకుడు వీరిలో ఎవరూ ప్రజలకు కన్పించడం లేదని, మూడోసారి మళ్లీ సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లకు ఇది అర్థం కాదని, చేతకాని నేతలు సభలు నిర్వహిస్తూ, పాదయాత్రలు చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్లకు అర్థం కాదని, కేసీఆర్‌కు మిగతా నేతలకు మధ్య ఉన్న రేఖను ప్రజలు గమనించారన్నారు. ఉద్యమంలో పనిచేసినోళ్లకే తెలంగాణ ఆర్ద్రత, బాధలు తెలుస్తాయని,

మార్క్ ఫెడ్ ఆదాయాన్ని పెంచుకునేందుకు పెట్రోలు బంకు ఏర్పాటు చేయడం ఆదర్శ ప్రాయమని మంత్రి అభినందించారు. ప్రభుత్వ అధికారులు ఈ ఫిల్లింగ్ స్టేషన్‌ను వినియోగించు కోవాలని కోరారు. యాసంగి సాగులో ఆల్ టైం రికార్డు సాధించామని తెలిపారు. 2014లో 28.18 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని, ఈ సారి 68.53 లక్షల పైగా యాసంగిలో వరి వేశారన్నారు. వ్యవసాయ వృద్ధిరేటులో మనం దేశంలో నెంబర్ వన్ అని, సీఎం విధానాల వల్లే ఈ లక్ష్యం సాధ్యమైందని మంత్రి అన్నారు.

వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించడం వల్ల మిగతా రంగాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం పెరగడం వల్ల సహకార రంగం బలోపేతంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి ఇఫ్పటి వరకు వ్యవసాయం కోసం రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని, తెలంగాణ కంటే బౌగోళికంగా పెద్దగా ఉన్న రాష్ట్రాల్లో పావు శాతం కూడా ఖర్చు చేయలేదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ కంటే ఐదింతుల పెద్దదిగా ఉన్న ఉత్తర ప్రదేష్, నాలుగింతలు పెద్దదైన మహారాష్ట్ర, మూడింతలు పెద్దదైన మధ్యప్రదేష్ రాష్ట్రాల్లో వ్యవసాయం కోసం బోటాబోటిగా నిధులు వెచ్చిస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల పలితంగా ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయన్నారు. పాదయాత్రల పేరుతో ప్రభుత్వంపై నిందలు మోపుతూ సంస్కార హీనంగా విపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారన్నారు.

ఒక్కరు కూడా నిర్మాణాత్మక సూచనలు చేయడం లేదని, తెలంగాణ ఏర్పాటుకు ద్రోహం చేసిన వారు కొత్త ముసుగు వేసుకుని వచ్చి నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల వీరికి బాధ్యత గానీ, భవిష్యత్ పట్ల ప్రణాళిక గానీ లేదని ఆరోపించారు. రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి ఒక్క కేసీఆరేనని, ఆయనను మించి ఆలోచించే విపక్ష నేతలు ఎవరూ రాష్ట్రంలో లేరని సింగిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story