CM Revanth Reddy : తాము 10 నెలల్లో చేసింది.. మీరు 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2025-03-20 12:35:39.0  )
CM Revanth Reddy : తాము 10 నెలల్లో చేసింది.. మీరు 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : రవీంద్ర భారతి(Ravindhra Bharathi)లో గురువారం "కొలువుల పండుగ"(Koluvula Pandaga) కార్యక్రమం ఘనంగా జరిగింది. పంచాయతీ రాజ్‌ శాఖలో కారుణ్య నియామకాల(Compassionate Appointments) కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగుల, అమరవీరుల ఆకాంక్షల ఫలితమే తెలంగాణ రాష్ట్ర(Telangana State) ఏర్పాటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications) ఇచ్చి చేతులు దులుపుకున్నారని, నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఏడాది పాలనలో 55 వేల ఉద్యోగ నియామకాలు చేశామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 500 పైచిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చింది తామేనని అన్నారు.

ప్రతిపక్షాలు ఉద్యోగ నియామకాలు ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అన్ని ప్రక్రియలు పూర్తి చేస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగనివ్వకూడదని నిర్ణయించామని.. వెంటవెంటనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు ఇస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఏ బాధ్యతలు విస్మరించిందో వాటిని తాము నెరవేరస్తున్నామని పేర్కొన్నారు. 10 నెలల్లో మేము చేసిన పనులను 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను ప్రజలు తిరస్కరిస్తే.. ఆయన వెంటనే వేరే పదవులు ఇచ్చారని, మరి ఈ పదేళ్లల్లో ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబానికి కారుణ్య నియామకం ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 1000 ఆర్టీసీ బస్సులను వారికి అందించి వ్యాపారులుగా మార్చామని పేర్కొన్నారు.

43 లక్షల మంది ఆడపడుచులకు రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని, 59 వేల ఉద్యోగ నియామకాలు ఇచ్చామని.. ఇవన్నీ ఒక్క ఏడాదిలో తాను చేశానని తెలిపారు. ప్రజలు తనపై కోపంగా ఉన్నారని ప్రతిపక్షాలు అనడం విడ్డూరంగా ఉందని.. ఇన్ని పనులు, సంక్షేమ పథకాలు చేసినందుకు తనపై కోపంగా ఉన్నారా అని విపక్షాలను ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాత్రమే మారారని, అధికారులు మాత్రం వారేనని.. తాను ఒక్కసారి ఆర్డర్స్ ఇస్తే.. వారందరినీ లోపల వేస్తారని, కాని తాను కేసీఆర్ లాగ నియంత పనులు చేయలేనని అన్నారు. తనకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసని, గత పాలకులకు లేని విజ్ఞత తమకు ఉందని అన్నారు. సచివాలయానికి రాని కేసీఆర్ కు పరిపాలన మీద పట్టు ఉంటుందా? రోజుకు 18 గంటలు పనిచేసే తనకు, తన మంత్రులకు పట్టు ఉంటుందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు.

Next Story

Most Viewed