T-బీజేపీలో అలగ్.. సలగ్.. ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ ఎవరి దారి వారిదే..!

by Satheesh |   ( Updated:2023-09-16 00:31:07.0  )
T-బీజేపీలో అలగ్.. సలగ్.. ఎన్నికలు ముంచుకొస్తోన్న వేళ ఎవరి దారి వారిదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కీలక నేతల తీరు శ్రేణులను కలవరపెడుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు ముఖ్య నేతలు వ్యవహరిస్తున్నారు. నేతల మధ్య సఖ్యత కుదరడం లేదని తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణలో ఎన్నికలకు సమయం ముంచుకొస్టుంటే.. నేతలు మాత్రం మేమింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు రాని, ఇంకేమైనా రాని మేం మారబోమని సంకేతాలిస్తున్నారు. పార్టీలో చిన్న చిన్న ఇష్యూస్ చిలికి చిలికి గాలి వానగా మారుతున్నాయి.

కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకునే చిన్న అంశాలను కూడా భూతద్ధం పెట్టి సమస్యలను మరింత జఠిలం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్‌ను ఢీకొట్టేందుకు మిషన్ 90 అంటూ గొప్పగొప్ప మాటలు చెప్పిన నేతలు అమలులో మాత్రం చేతులెత్తేస్తున్నారు. ప్రతి సందర్భంలో కమలనాథులు గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేస్తామంటూ మాటలు చెబుతున్నా.. చేతలు మాత్రం పార్టీ కార్యాలయం గడప కూడా దాటడంలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈనెల 17వ తేదీన అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా బీజేపీ ఇన్విటేషన్ పంపించింది. అయితే ఈ వేడుకల ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పర్యవేక్షిస్తారని రాష్ట్ర నాయకత్వం నుంచి మీడియాకు సమాచారం అందింది.

కానీ దీనిపై లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో లక్ష్మణ్ తనకేం సంబంధం అన్నట్లుగా మిన్నకుండిపోయారు. అలాగే పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు కిషన్ రెడ్డి చేపట్టిన బైక్ ర్యాలీకి కూడా లక్ష్మణ్‌కు ఇన్విటేషన్ అందలేదని తెలుస్తోంది.

ఇదిలాఉండగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరుద్యోగ నిరాహార దీక్షను ఇందిరాపార్క్ వద్ద చేపట్టారు. అయితే అజిటేషన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్.. దీక్షకు సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్‌తో చర్చించకుండానే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. తప్పనిసరి పరిస్థితిలో కిషన్ రెడ్డి 24 గంటల పాటు దీక్ష చేయాల్సి వచ్చింది. ఇదిలాఉండగా జాయినింగ్స్ విషయంలోనే నేతల మధ్య పొసగడం లేదు. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అంటున్నారు. మాజీ మంత్రి కృష్ణయాదవ్ విషయంలో ఈటల, కిషన్ రెడ్డికి మధ్య విబేధాలు మొదలైనట్లు తెలుస్తోంది.

అలాగే, చికోటి ప్రవీణ్ విషయంలో లక్ష్మణ్, కిషన్ రెడ్డికి మధ్య అంతర్యుద్ధం సాగినట్లు సమాచారం. కాగా బీజేపీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో బండి సంజయ్‌కు ప్రియారిటీ దక్కడంలేదని చెబుతున్నారు. దీంతో ఆయన కరీంనగర్‌కే పరిమితం కావాలని భావిస్తున్నట్లు టాక్. బడా నేతల తీరుతో నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పడ్డారు. అన్నీ తెలిసిన వారే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయన్నది చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed