బీజేపీలో క్షణ క్షణం ఉత్కంఠ.. ఆ స్థానాల్లో గెలుపుపై ధీమా

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-30 02:32:59.0  )
బీజేపీలో క్షణ క్షణం ఉత్కంఠ.. ఆ స్థానాల్లో గెలుపుపై ధీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలూ మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అనంతరం మైకులు మూగబోయాయి. మొన్నటి వరకు ప్రచారం, నిన్న పోల్ మేనేజ్ మెంట్‌లో బిజీగా ఉన్న నేతల్లో ఇప్పడు టెన్షన్ మొదలైంది. అభ్యర్థులకు పోలింగ్ ఒక పరీక్షగా మారింది. బీజేపీ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయం వరిస్తుందా.. లేదా? అనే భయం పట్టుకుంది. కొందరు కాషాయ పార్టీ అభ్యర్థులైతే గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బోథ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు.

అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోషామహల్ నుంచి బరిలో రాజాసింగ్, హుజురాబాద్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. వారంతా తమ గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. మళ్లీ చట్ట సభల్లోకి అడుగుపెడతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను కాపాడుకుంటూనే ఇతర సెగ్మెంట్లలోనూ విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో విజయ తీరాలకు చేరుతామని ఆ పార్టీ భావిస్తోంది. దానికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. నిరుద్యోగులు, యువత ఓట్లతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుతో తెచ్చినందున మహిళల ఓట్లు కూడా కాషాయ పార్టీకే పడుతాయని భావిస్తున్నారు.

త్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక అంశాలతో ముస్లిం మహిళల ఓట్లు కూడా తమకు ప్లస్ అవుతాయని లెక్కలు వేసుకుంటున్నారు. మాదిగల వర్గీకరణ అంశంపై బీజేపీ సానుకూలంగా ఉంది. ఇప్పటికే మోడీ ముఖ్య అతిథిగా సభను నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతోంది. దీంతో వారి ఓట్లు కూడా కాషాయ పార్టీకి అనుకూలంగా మారుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు నేతలు ఎన్ని సీట్లు వచ్చినా అధికారం తమదేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ నేతలు వేసుకుంటున్న లెక్కలు ఫలిస్తాయా? లేదా? అనేది చూడాలి.

Advertisement

Next Story