బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ సోయం బాపూరావు..?

by Javid Pasha |   ( Updated:2023-09-27 05:50:39.0  )
బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్‌లోకి ఎంపీ సోయం బాపూరావు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల తరుణంలో తెలంగాణ బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. బీజేపీలోని అసంతృప్తి నేతలందరూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు కాషాయ నేతలు పార్టీని వీడగా.. త్వరలోనే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కూడా ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరనున్నారనే ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న వివేక్.. రేపు, మాపో బీఆర్ఎస్‌లో చేరనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా బీజేపీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బోథ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బాపూరావు పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశాల సందర్భంగా బాపూరావు కాంగ్రెస్‌లో చేరే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తావించారనే టాక్ నడుస్తోంది.

గతంలో సోయం బాపూరావు టీడీపీలో పనిచేసిన సమయంలో రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆయనను రేవంత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి బాపూరావుకు కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. అక్కడ నుంచి బాపూరావును బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో బాపూరావు ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. బాపూరావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం గతంలో కూడా జరగ్గా.. ఆయన ఖండించారు. కానీ ఎన్నికల తరుణంలో ఏమైనా జరగొచ్చని, బాపూరావు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం బలంగా నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed