బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన యువతి ఆత్మహత్యాయత్నం

by Sathputhe Rajesh |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన యువతి ఆత్మహత్యాయత్నం
X

దిశ ప్రతినిధి, నిర్మల్ / శేరిలింగంపల్లి : బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన డెయిరీ మిల్క్ ప్రొడక్ట్ సీఈవో ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. నార్సింగ్ పోలీసులు విచారణ కోసం వెళ్లగా సీఈవో హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే ఆమెను మాదాపూర్ మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. గత కొంతకాలంగా ఆయనను వెంటాడుతున్న ఓ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ సీఈవో తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.

బెల్లంపల్లి నియోజకవర్గం లో మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారం కోసం రెండు ఎకరాల స్థలం సమకూర్చి వ్యాపారంలో భాగస్వామ్యం కోసం తన సన్నిహితులను చేర్చుకోవాలని సదరు ఎమ్మెల్యే ఒత్తిడి చేసినట్లు సీఈవో పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఎమ్మెల్యే‌పై ఆమె లైంగిక ఆరోపణలు కూడా చేసింది. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తనతో పాటు వచ్చిన మరో యువతిని ఆల్కహాల్ ఆఫర్ చేయడంతో పాటు ఆమెను తన వద్దకు పంపాలని కోరినట్టు సీఈఓ ఆరోపించారు. దీన్ని ఎమ్మెల్యే సీరియస్‌గా ఖండించారు.

ఈ క్రమంలోనే సీఈఓ తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆమె గతంలో ఆరోపణలు చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం తీవ్రంగా కలకలం రేపింది. బెల్లంపల్లి నియోజకవర్గంలో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ తాజా పరిణామాలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఇప్పటికే బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సదరు ఎమ్మెల్యే రాజకీయ భవితవ్యం పై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed