మండుతున్న ఎండలు..రికార్డు స్థాయిలో వేడి

by Rajesh |
మండుతున్న ఎండలు..రికార్డు స్థాయిలో వేడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరుగుతున్నది. ఏడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో నార్మల్ కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల వరకూ ఇదే స్థాయిలో కొనసాగుతుందని, సగటున 4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాల్లో భారీ స్థాయిలో పగటి టెంపరేచర్ నమోదవుతున్నది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో గురువారం 43 డిగ్రీలు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా చాపరాలలో శుక్రవారం 41.8 డిగ్రీలు, జైనధ్‌లో 42.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. వడగాలులు ఉంటాయని, మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉన్నా వేడి గాలుల నుంచి ప్రజలు రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వాతావరణ కేంద్రం సూచించింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం వేడి గాలులు ఎక్కువగానే వీచాయని, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహా పరిస్థితి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. బంగాళాఖాతం-హిందూ మహాసముద్రం మధ్యలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పరిస్థితి కొంత చల్లబడినట్లు అనిపిస్తున్నా అది దిశ మారడంతో వర్షాలు పడే అవకాశం తక్కువగానే ఉన్నట్లు పేర్కొన్నది. హైదరాబాద్ నగరంలోనూ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో తారస్థాయికి చేరవచ్చని, గతేడాదికంటే ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Advertisement

Next Story

Most Viewed