దశాబ్ది వేడుకలను ఓయూ వేదికగా నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్

by Javid Pasha |
దశాబ్ది వేడుకలను ఓయూ వేదికగా నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సర్కార్ అట్టహాసంగా దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించాలని ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి మొదలుకొని 21 రోజుల పాటు పలు రకాల అంశాలతో వేడుకలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలా ఉన్నాయని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. దశాబ్ధి ఉత్సవాలు జరగాల్సింది ఎక్కడో కాదని, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మలిదశ ఉద్యమానికి ఊపిర్లూదిన ఓయూను కాదని వేడుకలు నిర్వహించడంపై పలు సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. మలిదశకు ఊపిరి పోసిన ఉస్మానియాను ఎలా మరిచిపోతారని విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

దాదాపు 1200 మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేవలం బీఆర్ఎస్ పేటెంట్ గా భావించి ఉత్సవాలు చేపట్టడంపై విద్యార్థి సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. విద్యార్థుల బలిదానాలు బీఆర్ఎస్ కు యాదిలేవా అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. అమరుల త్యాగాలకు గుర్తింపు దక్కాల్సిందేనని, తెలంగాణ ఏ ఒక్కరి సొత్తు కాదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నాయి. అమరుల కుటుంబాలను పిలిచి వారిని సన్మానించడంతో పాటు ప్రత్యేక గుర్తింపునివ్వాలని పట్టుబడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి అమరుల త్యాగాలంటే లెక్కలేకుండా పోయిందని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బలిదానాలు చేసుకుని సాధించిన తెలంగాణలో యువతకు ఎలాంటి న్యాయం కేసీఆర్ చేయలేకపోయారని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత యువత ఆత్మహత్యలకు పాల్పడటం బీఆర్ఎస్ వైఫల్యమేనని విద్యార్థి సంఘాల నేతలు విమర్శలు చేస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు, నాణ్యమైన విద్య అందించడంలోనూ సర్కార్ ఫెయిలైందని మండిపడుతున్నారు. తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ మాత్రమే కాదని సబ్బండ వర్గాలు తమ బతుకులు బాగుపడుతాయని పోరాటాలు చేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కుల, ప్రజా, విద్యార్థి, అడ్వకేట్స్, జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ధి ఉత్సవాలు జరగాలని విద్యార్థి సంఘాల నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

స్వరాష్ట్రంలోనూ బలిదానాలే.. ఎల్చాల దత్తాత్రేయ, తెలంగాణ స్టూడెంట్స్ జేఏసీ ఓయూ ప్రెసిడెంట్

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ బలిదానాలు తప్పడంలేదు. రాష్ట్రం కోసం 1200 మంది అమరులైతే.. తెలంగాణ వచ్చాక ఇంకెందరో యువత ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ పేటెంట్ కాదు. విద్యార్థుల బలిదానాలతో రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కులేకపోవడం దుర్మార్గం. ప్రజలకు.. బీఆర్ఎస్ ఎలాంటి అన్యాయాలు, మోసాలు చేసిందో మేధావులు, విద్యార్థి సంఘాలు వివరించాలి. లేదంటే యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది. ఏకతాటిపై వచ్చి మరో ఉద్యమాన్ని చేపట్టాలి. లేదంటే విద్యార్థి సంఘాల నేతలు తప్పు చేసినవారవుతారు.


Advertisement

Next Story

Most Viewed