- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బట్టబయలు కానున్న ప్రతిష్టాత్మక ‘కాళేశ్వరం’ గుట్టు.. BRS నేతల్లో టెన్షన్.. టెన్షన్..!
కాళేశ్వరం ప్రాజెక్టు గుట్టు రట్టయ్యే రోజులు దగ్గరపడ్డాయా? నైరుతి రుతపవనాల రాక ఆలస్యమైతే రైతులకు సాగునీటి తిప్పలు తప్పవా? ఫలితంగా ప్రాజెక్టు ప్రయోజనమెంతో తేలిపోనుందా? గతేడాది వర్షాలకు నీట మునిగిన మోటారు పంపుల రిపేర్ పనులు ఇప్పట్లో పూర్తవుతాయా? వర్షాలు కురవకుంటే రైతుల్లో పెరిగే అలజడి అధికారపార్టీ మెడకు చుట్టుకుంటుందా? రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై దాని ఎఫెక్ట్ పడుతుందా? అనే ప్రశ్నలు బీఆర్ఎస్ లీడర్లకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఈసారి నైరుతి ఆలస్యం కావడంతో పాటు వర్షాలు సకాలంలో కురవకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో గులాబీ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుత కట్టడమని దశాబ్ది ఉత్సవాల్లో గులాబీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి కష్టకాలంలో అది రైతుల సాగునీటి అవసరాలను ఏ మేరకు నెరవేరుస్తుందనేది కరువు పరిస్థితులు తేల్చనున్నాయి. ప్రాజెక్టు డిజైన్ లోపాలు సహా అది నెరవేర్చే ప్రయోజనాల అసలు కథ తేలిపోనున్నది. కరువు పరిస్థితులు రైతుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తే.. వారి ఆగ్రహం ఓట్ల రూపంలో పొలిటికల్ పార్టీలకు సంకటంగా మారుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేండ్ల పాటు సీఎంగా కొనసాగినా.. 2004లో జరిగిన ఎన్నికలకు ముందు రెండు, మూడేండ్లు వరుస కరువు సంభవించి అది ఆయన రాజకీయ భవిష్యత్తునే మార్చేసింది.
పదేండ్ల పాటు అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ సంవత్సరం నార్మల్ వర్షపాతమే నమోదైంది. కరువు పరిస్థితులు లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ లాంటి అంశాలు అధికార పార్టీని ఆదుకున్నాయి. ఒక్క ఏడాది కూడా కరువు పరిస్థితి సంకటంగా మారలేదు. కానీ ఈసారి ఢిల్లీలోని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సాధారణ వర్షపాతం కురుస్తుందని చెబుతున్నది. సీజన్ చివరి నాటికి మామూలు వర్షపాతం నమోదు కావచ్చుగానీ సాగు సీజన్‌లో అవసరమైన టైమ్‌లో వానలు ఉండకపోవచ్చని పేర్కొన్నది.
దీన్ని దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం కూడా సోయా, పత్తి లాంటి పంటలను తొందరపడి ఇప్పుడే విత్తుకోవద్దంటూ రైతులను అప్రమత్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అనావృష్టి ప్రభావం రైతుల్లో ఎలాంటి అలజడిని సృష్టిస్తుందో, అది ఆగ్రహం రూపంలో ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుబోతున్నదోననే గుబులు అధికార పార్టీ నేతల్లో నెలకొన్నది.
తొమ్మిదేండ్ల పాటు సాఫీగా సాగిన ప్రయాణం.. సరిగ్గా ఎన్నికల సమయంలో పుట్టి ముంచుతుందేమోననే అనుమానం వారిని వెంటాడుతున్నది. వర్షాలు ఉన్నా లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది గదా అనే ధీమా ఉన్నా.. అది ఎన్ని వారాలు ఆదుకుంటుందో వేచి చూడాల్సిందే! ఈ ప్రాజెక్టు హిట్టా ఫట్టా అనేది కరువు వచ్చినప్పుడు తేలిపోనున్నది. గతంలో ఇంజనీర్లంతా ఈ ప్రాజెక్టు వ్యర్థమని, రూ.వేల కోట్ల నీటిపాలు చేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఆ ప్రాజెక్టు సత్తా ఎంత అనేదాన్ని కరువు పరిస్థితులు డిసైడ్ చేయనున్నాయి.
ఈసారి కాళేశ్వరం పంపింగ్ సాధ్యమేనా..?
సుమారు రూ. 86 వేల కోట్లతో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. గోదావరి నీళ్లను లిఫ్టుల ద్వారా పంప్ చేసి రైతులకు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. కానీ ఈసారి రుతుపవనాలు ఇప్పటికే ఆలస్యమయ్యాయి. ఇప్పటిదాకా తొలకరి పలకరింపే లేదు. ఇంకా ఆలస్యమైతే రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. వాతావరణ శాఖ అంచనా మేరకు సరైన టైంలో వర్షాలు కురవక, వర్షపాతం తగ్గితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను పంపింగ్ చేయడం కష్టమే. ఇదే అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికార పార్టీని ఆందోళనలో పడేస్తున్నది.
దీనికి తోడు గతేడాది కురిసిన భారీ వర్షాలతో రెండు పంప్ హౌజ్‌లు నీట మునిగాయి. ఏడాది అవుతున్నా ఇంకా వాటికి మరమ్మతు పనులు జరుగుతూనే ఉన్నాయి. కరువు ఏర్పడితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయాల్సిన ఈ పంపులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోతే రైతులకు సాగునీటిని అందించడం ఎలా అనే విషయం ఇంజినీర్లను సతమతం చేస్తున్నది. ఈ పంప్ హౌజ్‌లకు జరిగిన నష్టంపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.
రిపేర్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో బహిర్గతం చేయలేదు. మోటారు పంపులు మునిగినప్పటి నుంచీ అటు మీడియా ప్రతినిధులను, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలను అధికారులు అక్కడికి వెళ్లనీయడంలేదు. అప్రకటితంగా ఆ సైట్ విజిట్‌పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. దీంతో ఈసారి వర్షాలు సరిగ్గా కురవకుంటే రైతులకు సాగునీటిని అందించడంలో ప్రాజెక్టు, పంపులు ఎఫెక్టు చూపనున్నాయి. గోదావరి నీటిని లిప్టు చేసి దిగువకు అందించడం సాధ్యమేనా లేదా అనేది తేలిపోతుంది.
ఎన్నికల్లో ఎఫెక్ట్
రూ. వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను పంపింగ్ చేయకపోతే అది వచ్చే ఎన్నికల్లో నెగిటివ్‌గా మారుతుందనే భయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటాడుతున్నది. ప్రాజెక్టు నిర్మాణంపై వచ్చిన విమర్శలను సీఎం కేసీఆర్ లెక్క చేయలేదు. అనుకున్నట్లుగా నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. రైతులకు అవసరమైనప్పుడు నీళ్లు ఇవ్వలేకపోతే ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలే నిజమయ్యాయనే అపవాదును అధికార పార్టీ మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశం బీఆర్ఎస్ స్థానిక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలవరపెడుతున్న అంశం.
ఒకవేళ అదే జరిగితే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికి విపక్షాలకు ఎన్నికల సమయంలో అతి పెద్ద అస్త్రం దొరికినట్లవుతుంది. ప్రచారానికి వెళ్లే టైమ్‌కు కరువు పరిస్థితులు కంటిన్యూ అయితే రైతుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే ఆందోళన గులాబీ నేతల్లో మొదలైంది. ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ ముందుగానే ఊహించారో ఏమోగానీ.. కాళేశ్వరం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి పంటల సీజన్‌ను ఒక నెల ముందుకు జరిపే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని విపక్ష నేతలు ఇప్పటికే ఆరోపణలు మొదలుపెట్టారు.
సీఎం ఆలోచనతోనే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వర్షాలు ఆలస్యమయ్యేకొద్దీ పంటల సాగు కూడా ఆలస్యం అవుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తలెత్తబోయే పరిస్థితులకు తగినట్లుగా వ్యూహాన్ని రూపొందించుకోవడంపై బీఆర్ఎస్ లోకల్ లీడర్లు దీర్ఘాలోచనలో పడ్డారు. గొప్పదనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టే ఈసారి తమ భవిష్యత్తును తేల్చేస్తుందేమో అనే గుబులు ఉత్తర తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలను నిద్రపోనివ్వడంలేదు.
రైతుల నుంచి వ్యతిరేకత?
వర్షాలు ఆలస్యమవుతున్న కొద్దీ రైతుల్లో ఆందోళన పెరగడం సహజం. కానీ ఇది పరోక్షంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచే అవకాశాలెక్కువ అని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్షాలు సకాలంలో పడి పంట అవసరాలను తీరిస్తే రైతులు రాజకీయాలను పట్టించుకోరని, కానీ వారికి చిక్కులు ఎదురైనప్పుడే ప్రభుత్వంపై విరుచుకుపడతారని నిపుణులు గుర్తుచేశారు. చంద్రబాబుతో పాటు కేంద్రంలో వాజ్‌పేయికి కూడా ఈ కరువు పరిస్థితులే చిక్కులు తెచ్చిపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఒకవైపు వర్షాలు పడకుండా, మరోవైపు కాళేశ్వరం నుంచి నీళ్లు అందకుండా ఉంటే దాని వల్ల అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్నారు. విపక్షాలు ఇంతకాలం చేసిన, ఇప్పుడు చేస్తున్న విమర్శలే హైలైట్ అవుతాయని, రైతులు దాన్నే నమ్ముతారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే గోదావరి నీళ్లతో నిండిన చాలా చెరువులు ఎండిపోయాయన్నారు. వానలు మరింత ఆలస్యమైతే ఆ పరిసరాల్లో సాగుపై ప్రభావం ఉంటుందని ఇరిగేషన్ శాఖ వర్గాలూ ఆందోళనపడుతున్నాయి.
Read More: రాష్ట్రంలో ‘హరిత’ విధ్వంసం.. అటవీ ధ్వంసంలో దేశంలోనే తెలంగాణ నెం.1