ఆరోగ్య శ్రీటారిఫ్ చేంజ్?.. ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మార్పు

by srinivas |
ఆరోగ్య శ్రీటారిఫ్ చేంజ్?.. ప్రస్తుత ఖర్చులకు   అనుగుణంగా మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య శ్రీ చికిత్స ధరలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోన్నది. ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగానే టారిఫ్‌ను మార్చాలని ఆలోచిస్తున్నది. దీనిలో భాగంగానే సోమవారం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెల్త్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పదేళ్లుగా ఉన్న పాత ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆరోగ్య శ్రీ చికిత్స ప్రోసీజర్లు, ఆయుష్మాన్ భారత్‌లోని ప్రోసీజర్లు, వాటి టారిఫ్‌లు పెంచేందుకు అవలంబించాల్సిన విధానాన్ని తయారు చేయాలని మంత్రి ఆఫీసర్లకు సూచించారు. మరోవైపు ప్రస్తుతం అందిస్తున్న చికిత్సలకు అదనంగా మరో 65 ప్రొసీజర్లను కలిపేందుకు కృషి చేయాలన్నారు. ఎక్మో (ఎక్స్ ట్రాకార్పోరియల్ మెమ్ర్బేన్ ఆక్సిజనేషన్) రొబొటిక్ సర్జరీలు ఉండాలని సర్కార్ సూత్రపాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా ఆరోగ్య శ్రీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. మెజార్టీ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పటికీ ఆరోగ్య శ్రీ అంటే వెంటనే అడ్మిషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది.

ఇదంతా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమేనని స్వయంగా వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం, ప్రైవేట్, నెట్‌వర్క్ ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతోనే కొన్ని ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ అడ్మిషన్లకు నిరాకరించాయని అధికారులే చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.300 కోట్లకు పైనే ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిని చెల్లించేందుకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. పేదలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నది. కాంగ్రెస్ పవర్ లోకి రాగానే ఆరోగ్య శ్రీని రాజీవ్ ఆరోగ్య శ్రీగా మార్చడమే కాకుండా ఈ స్కీమ్ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.

రిజెక్ట్ చేయకుండా...?

రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా నెట్‌వర్క్ దవాఖాన్లు ఆరోగ్య శ్రీ చికిత్సను అందిస్తున్నాయి. అయితే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇతర కారణాలతో ఇక నుంచి పేషెంట్లను తిరస్కరిస్తే సదరు ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు తగిన విధంగా విధి, విధానాలు తయారు చేయాలని ప్రభుత్వం ఆఫీసర్లను ఆదేశించింది. ఏ రకమైన చర్యలు తీసుకుంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయనే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచనలు అందాయి. దీంతో కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు సన్నద్ధం జరుగుతున్నది.

Advertisement

Next Story