మునుగోడుపై BSP ఫోకస్.. భారీ వ్యూహంతో నేటినుంచి రంగంలోకి RSP

by GSrikanth |   ( Updated:2022-09-20 05:46:17.0  )
మునుగోడుపై BSP ఫోకస్.. భారీ వ్యూహంతో నేటినుంచి రంగంలోకి RSP
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ పర్యటన పూర్తి చేసుకోని ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్ర మునుగోడు నియోజకవర్గంలో చేపట్టనున్నారు. ఉదయం పది గంటలకు నగరంలోని ఎల్‌బీ‌నగర్ చింతల్‌కుంట నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మద్యహ్నం 12 గంటలకు చౌటుప్పల్‌లోని ఆందోల్ మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్థానికంగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం నారాయణపూర్‌, మునుగోడులోని అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సత్య ఫంక్షన్ హాల్‌కు భారీ ర్యాలీగా చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో యాత్ర కొనసాగనుంది.

బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి విడత యాత్రను ఈ ఏడాది మార్చి 6వ తేదీన జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్‌లో ప్రారంభించారు. 117 రోజులు ఈ యాత్ర కొనసాగింది. 778 గ్రామాలు పర్యటించారు. 17 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా 7 లక్షల మందిని నేరుగా కలిశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రెండో విడత బహుజన యాత్రను ఆ నియోజక పరిధిలో చేపడుతున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రతి గ్రామాన్ని టచ్ చేసేలా రూట్‌మ్యాప్ సెట్ చేసుకున్నారు.

దొరల పాలన అంతం చేస్తాం: ఆర్ఎస్పీ

సిద్దిపేట నుంచి దొరల పాలన అంతం చేస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన నాయకులు ఆర్ఎస్పీ సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో ప్రజాస్వామ్యం లేదని, రాజ్యాంగ విరుద్ధమైన పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. గుండాయిజం, బెదిరింపులు, నిరంతర పోలీసుల నిఘాలో సిద్దిపేట ప్రజలు భయంభయంగా బతుకుతున్నారని ఆరోపించారు. ఇదే సిద్దిపేట జిల్లా నుంచి రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి, పదవి చేపట్టిన తర్వాత భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళల మరణానికి కారణమయ్యారని, కనీసం బాధిత మహిళల కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు.

కేసీఆర్, హరీశ్ రావు విధానాన్ని వ్యతిరేకిస్తూ అదే జిల్లాకు చెందిన ప్రజలు భారత రాజ్యాంగాన్ని కాపాడే, ప్రజలను ప్రాణంగా ప్రేమించే బహుజన్ సమాజ్ పార్టీలో చేరారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మోసాలను తిప్పి కొట్టి బహుజన రాజ్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. బీఎస్పీ పార్టీ నిరుపేదలందరికీ ఒక ఎకరం భూమి, ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తుందని, 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులలో జనాభా దామాషా ప్రకారం వాటా ఇస్తామని ప్రకటించారు. జ్యోతి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మంద పాండు, కాంగ్రెస్ పార్టీ నుంచి పాషా, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్లాగౌడ్, శ్యామల, రాధిక, సత్తవ్వ వారి అనుచరులు మహిళలు విద్యార్థులకు ఆర్ఎస్పీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి : ఈ రోజు మునుగోడు కు నా సద్ది నేనే తెచ్చుకుంటున్న: RSP

Advertisement

Next Story