Skill University: ఆరోజు నుంచే స్కిల్ యూనివర్శిటీ నిర్మాణం పనులు ప్రారంభం

by Gantepaka Srikanth |
Skill University: ఆరోజు నుంచే స్కిల్ యూనివర్శిటీ నిర్మాణం పనులు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీ(Young India Telangana Skill University) క్యాంపస్ నిర్మాణం పనులు నవంబరు 6 నుంచి ప్రారంభం కానున్నాయి. పది నెలల్లోనే భవనాల నిర్మాణం పూర్తికావాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ భవనంతో పాటు అకడమిక్ బ్లాక్, వర్క్ షాపులు, హాస్టల్ బిల్డింగ్స్, డైనింగ్ హాల్ తదితరాలతో పాటు అందులో పనిచేసే సిబ్బందికి కూడా అక్కడే స్టాఫ్ క్వార్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 200 కోట్లతో భవనాల నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు రావడంతో ఇప్పటికే ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లపై సీఎం రేవంత్ చర్చించారు. కొన్ని మార్పులు చేర్పులను సూచించిన సీఎం... అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సిందిగా కోరారు. ప్రతీ భవనంపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఖర్చును ఆదా చేయడంతో పాటు గాలి వెలుతురు పుష్కలంగా వచ్చేలా, ఎయిర్ కండిషనర్ల వాడకాన్ని వీలైనంతగా తగ్గించేలా డిజైన్లలో మార్పులు చేసుకునే వెసులుబాటునూ నిర్మాణ సంస్థకు కల్పించారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ వర్శిటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే భూమిపూజ చేశారు. ఆడిటోరియం, క్రీడా మైదానం, పార్కింగ్ తదితరాలకు నిర్దిష్టంగా స్థలాన్ని కేటాయిస్తూ డిజైన్ల నమూనాలు రూపొందాయి. ఆరు వేల మంది విద్యార్థులకు 17 రకాల కోర్సులను అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడంతో దానికి తగినట్లుగా గ్రీనరీ కాన్సెప్టులో డిజైన్లను ఆర్కిటెక్టులు రూపొందించారు. రాష్ట్రంలోని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వివిధ ట్రేడ్‌లలో శిక్షణ అందించడంతో పాటు క్యాంపస్ ఇంటర్‌వ్యూల ద్వారా ‘ఉపాధి గ్యారంటీ’ పద్ధతిలో ఇండస్ట్రీస్ కూడా సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. అందువల్లనే ట్రెయినింగ్‌తో పాటు విద్యార్థులకు అక్కడే తగిన వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు వర్శిటీ పాలకమండలి గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్శిటీలు ఉన్నప్పటికీ వాటికి దీటుగా ఉండేలా, ఆదర్శంగా నిలిచేలా యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీ ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.

ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలను కల్పించడం ద్వారా ఈ విశ్వవిద్యాలయం మొత్తం దేశ దృష్టినే ఆకర్షిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. నిర్మాణ బాధ్యతలతో ముందుకొచ్చిన మెఘా కంపెనీతో ఆర్కిటెక్టు ఇంజినీర్ల సమన్వయం కోసం ప్రభుత్వం ప్రత్యేక మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. ఈ యూనివర్శిటీ పది నెలల్లోనే ఫంక్షనింగ్ ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో నవంబరు 6న లాంఛనంగా పనులు ప్రారంభం కానున్నాయి. ఇంజినీరింగ్ రంగంలో అనుభవం ఉన్న మేఘా కంపెనీ రూ. 200 కోట్లను విరాళంగా ప్రకటించడంతో దాని ఆధ్వర్యంలోనే స్కిల్ యూనివర్శిటీ మెయిన్ క్యాంపస్ రూపుదిద్దుకోనున్నది. అదానీ కంపెనీ సైతం రూ. 100 కోట్లను ఈ వర్శిటీకి డొనేషన్ ఇచ్చింది. వీటితో పాటు అనేక కార్పొరేట్ కంపెనీలు స్కిల్ వర్శిటీ ఏర్పాటులో భాగస్వామ్యం అవుతామని ప్రకటించి కార్పస్ ఫండ్ ఇవ్వడానికి హామీ ఇచ్చాయి. యూనివర్శిటీ నిర్వహణకు భవిష్యత్తులో ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed