నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. అగ్నిగుండంలా మారిన 22 జిల్లాలు

by GSrikanth |
నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. అగ్నిగుండంలా మారిన 22 జిల్లాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతున్నది. కేంధ్ర, రాష్ట్ర వాతావరణ పరిశోధనా కేంద్రాలు పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో వార్నింగ్‌లు జారీచేశాయి. ఈ నెల 5వ తేదీ వరకూ వేసవి తీవ్రత మరింత పెరుగుతుందని, ఉపశమనం కలిగే అవకాశం లేదని స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకంటే ఎక్కువే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ ఉత్తర, తూర్పు జిల్లాల్లో మాత్రం 46 డిగ్రీలు దాటింది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెడ్ డాక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, వడగాలులు వీస్తాయని స్పష్టం చేశారు.

రానున్న నాలుగైదు రోజుల్లో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మ,, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట తదితర జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని 22 జిల్లాలు రెడ్ జోన్‌లోకి వెళ్ళిపోయాయి. గడచిన నాలుగు రోజులుగా ఎండ తీవ్రతతో అవి రెడ్ జోన్ లోనే కొసాగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటూ అదే పరిస్థితి కొనసాగనున్నది. కేవలం పది జిల్లాలు మాత్రమే ఎల్లో అలర్టులో ఉంటున్నాయి. మిగిలిన జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

రాష్ట్రంలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్యలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి వచ్చిన గణాంకాలను పరిశీలిస్తే అత్యధికంగా నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు, సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా నేరెళ్ళలో 46.4 చొప్పున, మంచిర్యాల జిల్లా జన్నారంలో 46.2, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 46.2, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 46.1, నాగర్‌కర్నూల్ జిల్లా కిస్టంపల్లిలో 46 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 43.8 నుంచి 45 డిగ్రీల మధ్యలో రికార్డయింది. ఈ సీజన్‌లో సాధరణంతో పోలిస్తే 4 డిగ్రీలు ఈ సంవత్సరం ఎక్కువగా ఎండలు కాస్తున్నట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

Next Story