కేటీఆర్ ఆదేశంతోనే లగచర్ల ఘటన.. నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో వెల్లడి

by Shiva |
కేటీఆర్ ఆదేశంతోనే లగచర్ల ఘటన.. నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో వెల్లడి
X

దిశ, సిటీ క్రైం: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో జరిగిన ప్రభుత్వ అధికారుల‌పై హత్యాయత్నం దాడుల ఘటనలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులు మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో ఎఫ్ఐఆర్ నెంబరు 153/2024 లో ఏ1 గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి‌పై అభియోగం మోపారు. ఆయనే పక్కగా స్కెచ్ వేసి కుట్ర పూరితంగా రైతులకు న్యాయం చేసేందుకు నిర్వహించిన ప్రజా కార్యక్రమంలో వచ్చే ప్రభుత్వం ఉన్నతాధికారుల‌పై దాడికి పురిగొల్పి అధికారుల‌పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడే విధంగా ఈ కేసుల్లో నిందితులైన ఏ-2 నుంచి ఏ-45 వరకు రెచ్చగొట్టారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో అభియోగాన్ని వివరించారు.

పట్నం నరేందర్ రెడ్డి మొత్తం వెనకాల ఉండి నడిపించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితులు ముందస్తుగా రాళ్లు, మిర్చి పౌడర్, కర్రలను తీసుకువచ్చి పెట్టుకున్నారని ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో పాటు అరెస్టైన నిందుతులు వారి వాంగ్మూలాల్లో వివరించారని పోలీసులు తెలిపారు. అందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చినట్లు పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి ప్రజా కార్యక్రమాలను అడ్డుకుని ప్రభుత్వానికి ఇబ్బందులు గురి చేయాలనే కుట్రతో ఈ లగచర్ల సంఘటనను సృష్టించారని పోలీసులు తెలిపారు.

కేటీఆర్ ఆదేశాలతోనే..

రాజకీయంగా పేరుపొందాలనే లక్ష్యం, మరోవైపు మా పార్టీ నాయకుడు కేటీఆర్, మరికొందరు ఆదేశాలతో తాను 45 మందిని రెచ్చగొట్టానని పట్నం నరేందర్ రెడ్డి తన వాంగ్మూలంలో వివరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో వివరించారు. కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి‌చేయడం, కలవరం రేపడం, ప్రజలకు న్యాయం కలగకుండా అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే పట్నం నరేందర్ రెడ్డి అండ్ గ్యాంగ్ కుట్రకు తెర లేపారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపధ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్‌ను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.

కలెక్టర్‌తో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను ట్రాప్ చేసి వారిని స్కెచ్ వేసిన ప్రదేశానికి తీసుకువెళ్లేలా చేసిన భోగమోని సురేష్‌తో సెప్టెంబరు 1 నుంచి నవంబరు 11 వరకు పట్నం నరేందర్ రెడ్డి‌తో 84 సార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డాటా ద్వారా గుర్తించారు. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డి వాంగ్మూలం మేరకు కేటీఆర్‌తో పాటు ఇతర కీలక నేతల అరెస్ట్ ఉంటుందా లేదా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవుమంటారా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed